‘సూపర్ 30’ కంటే ముందే కథ రాశా

టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘సార్’ ఇటు తెలుగులో, అటు తమిళంలో మంచి టాక్ వసూళ్లతో సాగిపోతోంది. తమిళ కథానాయకుడు ధనుష్ ప్రధాన పాత్రలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దె సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించాడు. తన తొలి మూడు చిత్రాలకు పూర్తి భిన్నంగా సందేశంతో ముడిపడ్డ సినిమాను వెంకీ డీల్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది, అలాగే ఆశ్చర్యపరిచింది కూడా.

ఐతే హిందీ చిత్రం ‘సూపర్ 30’ చూసిన వాళ్లందరికీ.. ‘సార్’కు దానికి చాలా పోలికలు కనిపించాయి. కథాకథనాల్లో ఈ రెండు చిత్రాల మధ్య చాలా సారూప్యతలు గమనించవచ్చు. క్రిటిక్స్ అయితే ‘సూపర్ 30’కి ఇది సౌత్ వెర్షన్ అని కూడా వ్యాఖ్యానించారు. అలాగే కొందరు ‘3 ఇడియట్స్’ చిత్రంతోనూ దీనికి పోలికలు పెట్టారు. ఈ కామెంట్లపై దర్శకుడు వెంకీ అట్లూరి స్పందించాడు. ఆ రెండు చిత్రాలకు, ‘సార్’కు సంబంధం లేదని వ్యాఖ్యానించాడు.

‘‘నేను 90వ దశకంలో చదువుకున్నాను. అప్పటి నా అనుభవాలతోనే ఈ కథ రాశాను. అందరూ అంటున్నట్లు ‘సూపర్ 30’, ‘3 ఇడియట్స్’ చిత్రాలకు, దీనికి సంబంధం లేదు. సూపర్ 30 ఒక బయోపిక్. నా సినిమా కథ కల్పితం. నిజానికి నేను ‘సూపర్ 30’ రావడానికి ముందే ఈ కథ రాశాను. ఆ చిత్రం ఎడ్యుకేషన్ నేపథ్యంలో సాగుతుందని తెలిసినపుడు నా కథతో క్లాష్ అవుతుందేమో అని భయపడుతూ చూశా. కానీ దానికి, నా కథకు సంబంధం లేదని అర్థమైంది’’ అని వెంకీ తెలిపాడు.

ఈ కథ రాసినప్పటి నుంచి ధనుష్ తప్ప ప్రధాన పాత్రకు మరొకరిని అనుకోలేదని వెంకీ చెప్పాడు. ‘‘ధనుష్ గారికి కథ చెప్పే అవకాశం రాగానే ఎంతో సంతోషించా. కథ వినగానే చప్పట్లు కొట్టి ఎప్పుడు, ఎన్ని డేట్లు కావాలో చెప్పమని ధనుష్ అన్నారు. ఆయనంత క్లారిటీ ఉన్న నటుడిని నేను చూడలేదు. ‘సార్’ సినిమా తమిళ వెర్షన్‌ను చెన్నైలో ప్రేక్షకుల మధ్య చూశా. ధనుష్ అభిమానులతో పాటు అక్కడి ప్రేక్షకులందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారీ చిత్రాన్ని’’ అని వెంకీ తెలిపాడు.