టాలీవుడ్ మీద సైఫ్ అలీఖాన్ కన్ను

Saif Ali Khan

హిందీ సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్లకు సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాకపోతే ఖాన్ల ద్వయంలో ఉన్న అమీర్ షారుఖ్ సల్మాన్ రేంజ్ ఇతనికి లేదన్నది వాస్తవం. అయినప్పటికీ యాక్టర్ గా తను ఫెయిలైన దాఖలాలు పెద్దగా లేవు. మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో బ్లాక్ బస్టర్లు డిజాస్టర్లు అన్నీ ఉన్నాయి. అయితే హీరోగా కన్నా నెగటివ్ పాత్రలకు బాగా ఫిట్ అవుతాడన్న విషయం చాలాసార్లు ఋజువయ్యింది. ప్రభాస్ అది పురుష్ లో పది తలల రావణాసురుడిగా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని నుంచి పెద్ద బ్రేక్ ఆశిస్తున్నాడు.

ఇక్కడితో ఆగకుండా టాలీవుడ్ నుంచి పెద్ద ఆఫర్లు వస్తే ఒప్పుకునే ఆలోచన సైఫ్ బలంగా చేస్తున్నట్టు ముంబై టాక్. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే వారం ప్రారంభం కానున్న ప్యాన్ ఇండియా మూవీలో మెయిన్ విలన్ గా తననే సంప్రదించారని దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని ఇన్ సైడ్ న్యూస్. ఇందుకుగాను భారీ రెమ్యునరేషన్ ముట్టజెప్పబోతున్నట్టు వినికిడి. ఎంత మొత్తం ఆఫర్ చేశారని బయటికి చెప్పలేదు కానీ దాదాపు ఒక మీడియం తెలుగు సినిమాకయ్యే బడ్జెట్ అంత ఇస్తారని అంటున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ లెక్కన సంజయ్ దత్ లాగే సైఫ్ కూడా సౌత్ ఎంట్రీని సీరియస్ గా తీసుకున్నాడు. కెజిఎఫ్ లో గొప్ప గుర్తింపు వచ్చాక సంజు బాబా తమిళంలో విజయ్ లియోకు ఓకే చెప్పాడు. కథ ఎగ్జైట్ చేస్తే చాలు పచ్చ జెండా ఊపేస్తున్నాడు. సైఫ్ ఇదే రూట్ పడతాడు కాబోలు. క్రమంగా హిందీ సీనియర్ హీరోలంతా ఇలా మనపక్కకు షిఫ్ట్ అయిపోతే సరైన ప్రతినాయకులు లేరన్న కొరత తీరుతుంది. పైగా బిజినెస్ కోణంలో ఇది బాగా ప్లస్ అయ్యే అంశం. ఒకప్పుడు ముఖేష్ ఋషి, షియాజీ షిండే లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులతో విలన్ వేషాలు వేయించే స్థాయి నుంచి ఇప్పుడు సైఫ్ లాంటి స్టార్లను పట్టే స్థాయికి టాలీవుడ్ ఎదిగింది.