అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి తెలుగు సినీ ప్రేక్షకులంతా సమంత సినిమా శాకుంతలం గురించే మాట్లాడుతుండాలి. పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ చేయబోతున్నట్లు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రిలీజ్ దగ్గర పడుతుండగా నిర్మాతల ఆలోచన మారిపోయింది. సినిమాను వాయిదా వేసి ఏప్రిల్ 14కు ఫిక్స్ చేశారు.
17న సినిమా రాకపోవడానికి ప్రధాన కారణం.. 10న రావాల్సిన హిందీ చిత్రం షెజాదా 17కు వాయిదా పడడమే. భూల్ భులయియా-2 లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కార్తీక్ ఆర్యన్ నటించిన చిత్రమిది. ఈ సినిమా 17కు ఫిక్సయ్యేసరికి.. హిందీలో సరిపడా థియేటర్లు దొరకవని, దాని పోటీలో హిందీ ప్రేక్షకులు శాకుంతలంను పట్టించుకోరని దాని టీం భయపడి వెనక్కి తగ్గింది.
కానీ తీరా చూస్తే షెజాదా సినిమాకు ఉత్తరాదినే కాదు.. ఇంకెక్కడా కూడా అంతగా బజ్ కనిపించడం లేదు. తెలుగు బ్లాక్‌బస్టర్ అల వైకుంఠపురములోకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై హిందీ ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదు. ఒరిజినల్‌ను ఓటీటీల్లో హిందీ ఆడియన్స్ కూడా బాగా చూసేయడం, రీమేక్ ఏమాత్రం ఎగ్జైట్ చేయకపోవడంతో వారు దీన్ని పట్టించుకోవడం లేదు. ఇండియాలో ఎక్కడా కూడా ఈ సినిమా బుకింగ్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో లేవు.
సౌత్‌లో, అలాగే యుఎస్‌లో ఈ సినిమా వాషౌట్ అయిపోయేలా కనిపిస్తోంది. షెజాదాకు అమెరికాలో ప్రిమియర్స్ సేల్స్ మొదలుపెడితే కనీసం 500 టికెట్లు కూడా తెగలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దక్షిణాది నగరాల్లో థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉత్తరాదిన పరిస్థితి కాస్త మెరుగే కానీ.. అక్కడ కూడా తొలి రోజు థియేటర్లలో పెద్దగా జనం కనిపించేలా లేదు. శాకుంతలం ఇప్పుడే రిలీజై మంచి టాక్ తెచ్చుకుని ఉంటే దీనికి ఉత్తరాదిన థియేటర్ల సమస్యే ఉండేది కాదేమో.