స్పెషల్ షోలు పెంచుతున్నారు సార్

రేపు విడుదల కాబోతున్న సార్ మీద నిన్నా మొన్నటి దాకా అంచనాలు పెద్దగా లేవు కానీ టీమ్ చేస్తున్న తెలివైన ప్లానింగ్ వల్ల మెల్లగా బజ్ పెరుగుతోంది. రిలీజ్ కు ముందు రోజు సాయంత్రం స్పెషల్ ప్రీమియర్లను కేవలం మీడియాకి కాకుండా కామన్ పబ్లిక్ కు వేయాలని నిర్ణయం తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ముందు హైదరాబాద్ ఒకటే చాలనుకున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఇవాళ సాయంత్రం మూడు షోలు పెడితే ఇంకో రోజు మిగిలి ఉండగానే ఫుల్ అయిపోయాయి. టైం చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఇంకొన్ని జోడించే ప్రయత్నాలు ఆఘమేఘాల మీద జరుగుతున్నాయి.

దీంతో స్ట్రాటజీ మార్చేసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో సార్ స్పెషల్ షోలను వేయబోతున్నారు. విజయవాడ, వైజాగ్, నెల్లూరు, కాకినాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఆన్ లైన్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. రిలీజ్ కు ముందే అందరికంటే ఫస్ట్ సినిమా చూడాలన్న ఎగ్ జైట్మెంట్ ఈ రెస్పాన్స్ కు కారణమవుతోంది. విచిత్రంగా తమిళంలో వాతి టైటిల్ తో వస్తున్న సార్ కి అక్కడ ఈ స్థాయిలో హైప్ పెరగడం లేదు. ధనుష్ స్వతహాగా స్టార్ హీరోనే అయినప్పటికీ దర్శకుడు తెలుగు వాడు కావడంతో కోలీవుడ్ ట్రేడ్ కొంత అనుమానంగానే ఉంది.

అనుదీప్ ప్రిన్స్, వంశీ పైడిపల్లి వారసుడు ఆశించిన స్థాయిలో కంటెంట్ లేకపోవడంతో వాతి మీద డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా స్టార్ గెస్టులు లేకుండా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయ్యింది. జనానికి ఇదో సినిమా వస్తోందన్న సంగతి ప్రమోషన్ల ద్వారా రిజిస్టర్ అయిపోయింది. పోటీలో ఉన్న వినరో భాగ్యము విష్ణు కథ ఇప్పుడు కొంత వెనుకబడినట్టు కనిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా ఫైనల్ గా కంటెంటే మాట్లాడాలి కాబట్టి ఇంకో నలభై ఎనిమిది గంటల్లో మొత్తం ఎవరు విజేతో తేలిపోతుంది. ధనుష్ మొదటిసారి చేసిన టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ ఇది.