బన్నీ బ్లాక్ బస్టర్ రీమేక్ లైట్ తీసుకున్నారా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇప్పటికీ చాలా చోట్ల రికార్డులు భద్రంగా ఉన్న అల వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహజాదా ఈ శుక్రవరం విడుదల కానుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్ చూశాక ఒరిజినల్ ని మక్కికి మక్కి దింపేశారని స్పష్టంగా అర్థమయ్యింది. కాకపోతే నేటివిటీ మిస్ అయ్యిందని, బన్నీ స్టైల్ ని స్వాగ్ ని మ్యాచ్ చేయలేక కార్తీక్ కొంత కృత్రిమంగా కనిపించాడనే కామెంట్స్ వచ్చాయి. ప్రభాస్ ఆది పురుష్ లో సీతగా నటించిన కృతి సనన్ ఇందులో గ్లామర్ గట్టిగానే ఒలకబోసిందని పాటలు చూస్తేనే అర్థమైపోయింది.

ఇంకో మూడు రోజుల్లో విడుదల ఉన్నా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం సోసోగానే ఉన్నాయి. హాలీవుడ్ మూవీ ఆంట్ మ్యాన్ 3 క్వంటమానియా అమ్మకాలు దీనికన్నా చాలా భారీగా ఉన్నాయి. రెండింటి మధ్య వ్యత్యాసం నాలుగురెట్లు పైగానే ఉండటం చూసి బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు. పఠాన్ జోరు చూసి భయపడే ఫిబ్రవరి 10న రావాల్సిన షెహజాదా వారం ఆలస్యంగా రావాలని నిర్ణయం తీసుకుంది. తీరా చూస్తే ఇప్పుడేమో పరిస్థితి ఇలా ఉంది. కరెంట్ బుకింగ్స్ తో పాటు ఫస్ట్ డే టాక్ పాజిటివ్ వచ్చాక వసూళ్లు ఊపందుకుంటాయనే నమ్మకంతో ట్రేడ్ ఉంది.

ఇదంతా ఎలా ఉన్నా రీమేక్ కి మూడేళ్ళ సమయం పట్టడం ఇలాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంది. పైగా పుష్పతో అల్లు అర్జున్ కి నేషనల్ వైడ్ ఇమేజ్ వచ్చాక అందరూ దీన్ని నెట్ ఫ్లిక్స్ లో చూసేశారు. గోల్డ్ మైన్స్ సంస్థ డబ్బింగ్ చేసి వాళ్ళ శాటిలైట్ ఛానల్ లో ప్రసారం చేయబోతున్నట్టు ఇటీవలే అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చింది. షెహజాదాలో అల్లు అరవింద్ తో పాటు ఎస్ రాధాకృష్ణ నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. టబు పాత్రను మనిషా కొయిరాలా పోషించగా మురళి శర్మగా పరేష్ రావల్, సచిన్ కెడ్కర్ గా ఆయనే మళ్ళీ రిపీట్ అయ్యారు. పఠాన్ తర్వాత చెప్పుకోదగ్గ నార్త్ రిలీజ్ ఇదే.