హిట్టు కొట్టినా ఫలితం దక్కని దర్శకుడు

ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం హనుమాన్ జంక్షన్ తో టాలీవుడ్ దర్శకుడిగా అడుగు పెట్టిన మోహన్ రాజా ఆ తర్వాత పూర్తిగా తమిళంకే అంకితమైపోయాడు. ఎక్కువ రీమేకులతోనే హిట్లు కొట్టి బాగా సెటిలయ్యాడు. రెండు దశాబ్దాల తర్వాత చిరంజీవి పిలుపుతో లూసిఫర్ తెలుగు రూపకం కోసం వచ్చి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. టేకింగ్ పరంగా మంచి మార్కులతో భారీ ఓపెనింగ్ దక్కినప్పటికీ గాడ్ ఫాదర్ చివరికి బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయింది. నిర్మాత ఓన్ రిలీజ్ వల్ల భారీ లాభాలు వచ్చాయని పబ్లిక్ గా చెప్పేసినా బయ్యర్లు మాత్రం కాదంటున్నారు.

దీని సంగతలా ఉంచితే మోహన్ రాజా నాగార్జున కోసం ఎప్పుడో ఒక స్క్రిప్ట్ ని రెడీ చేసుకుని వినిపించి ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇప్పించుకున్నారు. ఇందులో అఖిల్ కాంబినేషన్ ఉంటుందని లీక్ కూడా వచ్చింది. కింగ్ వందవ ల్యాండ్ మార్క్ మూవీగా దీన్ని ప్లాన్ చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు దీని గురించి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. నాగార్జున త్వరలో రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేయబోయే సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఇది గత రెండు నెలల్లో జరిగిన డెవెలప్ మెంట్. అంటే మోహన్ రాజాని వద్దనుకున్నట్టేగా.

ఆయనేమో తని ఒరువన్(రామ్ చరణ్ ధృవ ఒరిజినల్ వెర్షన్) సీక్వెల్ పనుల్లో పడిపోయాడు. గాడ్ ఫాదర్ వల్ల అవకాశాలు క్యూ కడతాయనుకుంటే అది జరగకపోవడంతో తిరిగి బ్యాక్ టు పెవిలియన్ తప్పేలా లేదు. ఒకవేళ నాగ్ భవిష్యత్తులో చూద్దామని చెప్పారో లేదో తెలియాలన్నా ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. గాడ్ ఫాదర్ టైంలో ఎక్కడ చూసినా ఏ ఛానల్ లో విన్నా తన పేరే మారుమ్రోగిపోయేలా చేసుకున్న మోహన్ రాజాకు ఇలాంటి పరిస్థితి తలెత్తడం విచిత్రమే. ఇప్పటికిప్పుడైతే తెలుగులో పెద్ద హీరోలతో ఆఫర్లు లేనట్టే.