తన అన్నయ్య చిరంజీవి పేరెత్తితే చాలు ఎమోషనల్ అయిపోతుంటాడు పవన్ కళ్యాణ్. తన జీవితంలో ప్రతి మంచికీ చిరునే కారణం అని అంటుంటాడు. ఐతే పవన్ అంతగా ఇష్టపడే చిరులో తనకు నచ్చని విషయాలేమీ లేవా? అంటే.. కాదని అనలేదు పవర్ స్టార్. అన్నయ్యలో తనకు నచ్చిన విషయాలతో పాటు నచ్చని విషయం గురించి కూడా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్-2’ షోలో పవన్ వెల్లడించాడు. తన ఎపిసోడ్ తాలూకు రెండో భాగంలో పవన్ దీని గురించి మాట్లాడాడు.
ఒళ్లు దాచుకోకుండా కష్టపడే తత్వాన్ని తన అన్నయ్య నుంచే తాను నేర్చుకున్నానని.. అలాగే రాజకీయాల్లో విమర్శలను కచ్చితంగా స్వీకరించాలని.. దేన్నయినా భరించాలని కూడా ఆయన్నుంచే తెలుసుకున్నానని పవన్ తెలిపాడు.
అయితే తన అన్నయ్యలో తనకు నచ్చనిది, ఆయన్నుంచి స్వీకరించని ఒకటే ఉందని.. అదే మొహమాటం అని పవన్ తేల్చేశాడు. చిరుకు మొహమాటం ఎక్కువ అని, ఎవరినీ ఏమీ అనలేరని, నొప్పించలేరని పవన్ వ్యాఖ్యానించాడు. పవన్ మాత్రమే కాదు.. మెగా అభిమానులందరూ కూడా చిరు విషయంలో వ్యక్తం చేసే అభ్యంతరం ఇదే. ప్రతి ఒక్కరినీ మెప్పించాలనే క్రమంలో.. పవన్‌ను అనరాని మాటలు అనే రాజకీయ ప్రత్యర్థులతో కూడా చిరు సన్నిహితంగా మెలగడం, వారి గురించి పాజిటివ్‌గా మాట్లాడ్డం అభిమానులకు రుచించదు.
ఇక తాను రాజకీయాల్లోకి ఎలా వచ్చానో పవన్ వివరిస్తూ.. “నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉండేది. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని రక్షిత మంచినీరు అందించాలని ప్రయత్నించా. కానీ స్థానిక రాజకీయ గ్రూపులు అడ్డుకున్నాయి. మంచి చేయడానికి కూడా అడ్డంకులేంటో అర్థం కాలేదు. తర్వాత ఎన్జీవో మొదలుపెట్టాలనుకున్నా. కానీ నా ఆలోచన పరిధికి అది సరిపోదనిపించింది. ఇంకా పెద్దగా ఏదో చేయాలని రాజకీయ పార్టీ పెట్టా” అని చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates