ప్రభాస్ గురించి అతడి మాటలు ఎలా నమ్మారు?

ఉమైర్ సంధు.. ట్విట్టర్లో అతడికున్న ఫాలోవర్ల సంఖ్య 18 వేల లోపే. గతంలో ఈ పేరు మీద ఉన్న అకౌంట్‌కు ఒక మోస్తరుగానే ఫాలోయింగ్ ఉండేది. మధ్యలో అది సస్పెండయి.. కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడు. బయోలో ఏమో.. ‘మెంబర్ ఆఫ్ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్’ అని ఘనంగా రాసి ఉంటుంది. అంతే కాక ‘మోస్ట్ కాంట్రవర్శల్ నంబర్ వన్ సౌత్ ఏషియన్ క్రిటిక్’ అని కూడా రాసుకుని ఉంటాడు.

బాలీవుడ్లో అయినా, టాలీవుడ్లో అయినా, కోలీవుడ్లో అయినా ఏ పెద్ద సినిమా రిలీజవుతున్నా సరే.. విడుదలకు కొన్ని రోజుల ముందే అతను రివ్యూ ఇచ్చేస్తుంటాడు. ట్విట్టర్లో ఉన్న కొందరు వెర్రి జనాలేమో అతను సెన్సార్ కోసం వచ్చిన సినిమా చూసి ఒరిజినల్ రివ్యూ ఇస్తున్నాడేమో అనుకుంటారు. కానీ అతను ఇచ్చేది గాలి రివ్యూ. నోటికొచ్చినట్లు సినిమాను పొగడ్డమో. తిట్టడమో చేస్తాడు. కొన్ని టెంప్లేట్ డైలాగులతో రివ్యూ లాగించేస్తాడు.

తీరా చూస్తే సినిమా ఫలితానికి, అతను ఇచ్చిన రివ్యూకు సంబంధం ఉండదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సహా చాలా సినిమాలను బ్లాక్‌బస్టర్లుగా పేర్కొన్న చరిత్ర అతడిది. కేవలం సినిమా రివ్యూలతో సంబంధం లేకుండా సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి కూడా వివాదాస్పద పోస్టులు పెట్టి పబ్బం గడుపుకోవడం ఇతడికి అలవాటు. ఇలాంటి ఫేక్ పర్సన్ మొన్న ప్రభాస్, కృతి శెట్టిల ఎంగేజ్మెంట్ జరగబోతోందంటూ ఒక ట్విట్ వేశాడు. ఇతడి తీరేంటో కూడా తెలియకుండా బాలీవుడ్ ప్రముఖ వెబ్ సైట్లు దీని గురించి వార్తలు ఇచ్చేశాయి. కొన్ని గంటల్లోనే ప్రభాస్, కృతి నిశ్చితార్థం వార్త వైరల్ అయిపోయింది.

కానీ ఇది ఉత్త గాలి వార్త అని తర్వాత తెలుసుకుని అందరూ నాలుక కరుచుకున్నారు. ఒకసారి ఈ ఉమైర్ సంధు ట్విట్టర్ ప్రొఫైల్ తిరగేస్తే.. ఇతనో పెద్ద ఫేక్ పర్సన్ అనే విషయం ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. అలాంటి వ్యక్తి వేసిన ట్విట్‌‌ను ట్విట్టర్ జనాలు నమ్మడమేంటో.. వెబ్ సైట్లు వార్తలు ఇవ్వడమేంటో.. మళ్లీ ఇది గాలి వార్త అని అర్థమై నాలుక్కరుచుకోవడం ఏంటో అర్థం కావట్లేదు.