ఏజెంట్ బృందం మీద అభిమానుల గుస్సా

తమ హీరో మొదటి మాస్ యాక్షన్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏజెంట్ ఏప్రిల్ 28 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చారు. ముందు నుంచి అప్డేట్స్ విషయంలో నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్ టైన్మెంట్స్ అనుసరిస్తున్న శైలి పట్ల అక్కినేని ఫ్యాన్స్ అంత సంతృప్తిగా లేరు. ఇదే ప్రొడక్షన్ నుంచి షూటింగ్ లో ఉన్న భోళా శంకర్ కి రక్షా బంధన్ కు, చిరంజీవి మళ్ళీ సెట్స్ కి వచ్చినప్పుడు, ఇవాళ డాన్స్ షూట్ కి సంబందించి ఇలా క్రమం తప్పకుండా ట్విట్టర్ లో చెబుతూనే వచ్చారు.

కానీ ఏజెంట్ విషయంలో మాత్రం ఇంత యాక్టివ్ నెస్ చూపించలేదనేది వాళ్ళ ఫిర్యాదు. అందులో న్యాయం లేకపోలేదు. ఇప్పటిదాకా ఒక్క లిరికల్ సాంగ్ వదల్లేదు. ధృవ ఫేమ్ హిప్ హాఫ్ తమిజా ఇచ్చిన మ్యూజిక్ మీద భారీ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఎప్పుడు పాటల సందడి మొదలవుతుందో అంతు చిక్కడం లేదు. ఇటీవలే రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కి సంబంధించి వదిలిన చిన్న టీజర్ లో మొహమంతా రక్తంతో అఖిల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కు నెగటివ్ రియాక్షన్స్ ఎక్కువగా వచ్చాయి. లైగర్ వైబ్రేషన్స్ కనిపించాయంటూ నెటిజెన్లు ఓపెన్ గానే కామెంట్లు చేసుకున్నారు.

ఇవన్నీ దర్శకుడు సురేందర్ రెడ్డి గమనించుకోవాలి. ప్యాన్ ఇండియా మూవీస్ కి కోట్లు ఖర్చు పెడితే సరిపోదు. అంతకంతా ప్రమోషన్ చాలా అవసరం. లేదంటే ఇలా బజ్ లో తేడాలు వచ్చేస్తాయి. అసలే అదే రోజు పొన్నియన్ సెల్వన్ 2 రిలీజవుతూ తమిళ హిందీ మార్కెట్లలో పెద్ద ఛాలెంజ్ విసరనుంది. దాన్ని కాచుకోవాలంటే ఆషామాషీగా ఉంటే సరిపోదు. హీరోయిన్ లుక్ కానీ ఇతర పాత్రల తాలూకు వివరాలు కానీ ఏవీ చూపించకుండా ఇప్పటిదాకా నానుస్తూనే వచ్చారు. సాక్షి వైద్య హీరోయిన్ గా మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ఏజెంట్ చేతిలో ఉన్నది 80 రోజులే.