చిన్న సినిమాకు పెద్ద లాభం

‘ఛాయ్ బిస్కెట్’ పేరుతో ముందు ఒక వెబ్ సైట్ పెట్టి.. అందులో క్రియేటివ్ పోస్టులు పెడుతూ తెలుగు నెటిజన్లు ఆకర్షించి.. ఆపై షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు తీస్తూ తమ అభిరుచిని చాటుకుని ఆదరణను పెంచుకున్నారు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర. మంచి కంటెంట్ ఇస్తే కొంచెం ఆలస్యం అయినా బలమైన ఫ్యాన్ బేస్ పెరుగుతుంది అనడానికి ఛాయ్ బిస్కెట్ సంస్థే ఉదాహరణ. ఈ సంస్థ నుంచే సుహాస్, సందీప్ రాజ్ లాంటి ఎంతోమంది ప్రతిభావంతులు ప్రతిభ చాటుకుని సినిమాల్లోకి అడుగు పెట్టారు. అక్కడా సక్సెస్ అయ్యారు.

ఛాయ్ బిస్కెట్ అధినేతలు ఇప్పటికే ‘మేజర్’తో ఫిలిం ప్రొడక్షన్లోకి కూడా దిగారు. మహేష్ బాబుతో కలిసి అనురాగ్, శరత్ నిర్మించిన ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయి ఛాయ్ బిస్కెట్ సంస్థకు టాలీవుడ్లో ఘనమైన ఆరంభాన్నిచ్చింది. ఇప్పుడు ఈ సంస్థ సోలోగా ‘రైటర్ పద్మభూషణ్’ అనే చిన్న సినిమాను నిర్మించింది.

ఛాయ్ బిస్కెట్‌తో వెలుగులోకి వచ్చిన సుహాస్ హీరోగా, ఆ సంస్థ షార్ట్ ఫిలిమ్ తీసిన షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతూ తీర్చిదిద్దిన చిత్రమిది. తమదైన శైలిలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ ముంగిట మంచి బజ్ తీసుకురావడంలో ఛాయ్ బిస్కెట్ విజయవంతం అయింది. ఇళాంటి చిన్న సినిమాకు రిలీజ్ ముందు రోజే ప్రిమియర్లు పడడం.. అవి హౌస్ ఫుల్ కావడం విశేషమే. టాక్ కూడా బాగుండడం.. గత వీకెండ్లో దీనికి పోటీగా రిలీజైన సినిమాలు తేలిపోవడంతో ‘రైటర్ పద్మభూషణ్’ పెద్ద సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రోమోలు ఆకర్షణీయంగా ఉండడంతో థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఈ చిత్ర డిజిటల్ హక్కుల అమ్మకం పూర్తయింది.

సినిమాకు పబ్లిసిటీతో కలిపి నాలుగు కోట్ల దాకా అవగా.. ఆ మొత్తం ఓటీటీ డీల్‌తోనే వచ్చేసిందట. ఇప్పుడు థియేటర్ల ద్వారా వస్తున్నదంతా లాభమే. దీంతో పాటు శాటిలైట్, ఇతర హక్కులు ఉండనే ఉన్నాయి. అటు ఇటుగా పది కోట్లకు తక్కువ కాకుండా ఆదాయం తెచ్చిపెట్టేలా ఉందీ చిత్రం. అంటే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయినట్లే.