షారుఖ్ నుంచి ముందుంది అస‌లు మోత‌

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారుఖ్ ఖాన్ క‌మ్ బ్యాక్ మామూలుగా లేదు. ఒక మోస్త‌రు హిట్టు కోసం ద‌శాబ్దంన్న‌ర పాటు ఎదురు చూసిన అత‌ను.. ప‌ఠాన్ సినిమాతో సెన్సేష‌న‌ల్ క‌మ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ రూ.1000 కోట్ల క‌లెక్ష‌న్ల మార్కు దిశ‌గా దూసుకెళ్తోంది.

దీంతో షారుఖ్ క‌రువంతా తీరిపోయిన‌ట్లే. షారుఖ్ స‌క్సెస్ బాలీవుడ్‌కు కూడా గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. మ‌ళ్లీ ఓ హిందీ సినిమా చూసేందుకు ఈ స్థాయిలో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డంతో త‌మ క‌ష్టాలు తొల‌గిపోయిన‌ట్లే అని భావిస్తున్నారు. ఇక షారుఖ్ త‌ర్వాతి సినిమాల లైన‌ప్ చూస్తుంటే ఆయ‌న అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఇంకో రెండేళ్ల‌లో షారుఖ్ ఎవ్వ‌రూ అందుకోలేని స్థాయికి వెళ్లిపోతాడ‌ని వాళ్లు అంచ‌నాలు క‌డుతున్నారు.

ఈ ఏడాది ఇంకో ఆరు నెల‌ల‌కే జ‌వాన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు షారుఖ్. ఆ సినిమా తీస్తున్న‌ది త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ. అత‌ను క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీయ‌డంలో దిట్ట‌. స్టార్ హీరోల‌ను వారి అభిమానులే కాక మాస్ మెచ్చేలా ప్రెజెంట్ చేస్తాడ‌ని అత‌డికి పేరుంది.

ప‌ఠాన్‌ను మించిన ఎలివేష‌న్లు, యాక్ష‌న్ ఆ సినిమాలో ఉంటాయ‌ని భావిస్తున్నారు. ఇప్పుడు హిందీ ప్రేక్ష‌కులు ఆశిస్తున్న‌ది ఇలాంటి సినిమాలే. అట్లీ మినిమం గ్యారెంటీ సినిమా అందిస్తాడ‌ని అంచ‌నా. దీని త‌ర్వాత షారుఖ్ నుంచి రానున్న‌ది రాజ్ కుమార్ హిరానితో చేస్తున్న డంకి.

మున్నాభాయ్ ఎంబీబీఎస్ మొద‌లుకుని సంజు వ‌ర‌కు హిరాని అన్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్లే ఇచ్చాడు. టాప్ స్టార్‌తో ఆయ‌న జ‌త క‌డితే బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ద‌లు కావాల్సిందే. ప‌ఠాన్, జ‌వాన్ ప‌క్కా మాస్ సినిమాలు కాగా.. డంకి కంటెంట్ రిచ్ సినిమాగా ఉంటుంద‌న్న‌ది స్ప‌ష్టం.

షారుఖ్ ఫాం అందుకుని మంచి కంటెంట్ హిరాని మార్కు సినిమా చేస్తే దానికి ఆకాశ‌మే హ‌ద్దు అవుతుంది. అప్పుడు మ‌రోసారి బాక్సాఫీస్ రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయం.