బండ్లన్నా మళ్ళీ ఈ గోల ఏందన్నా

Bandla Ganesh

పవన్ కళ్యాణ్ అరివీర భక్తుడిగా పేరు తెచ్చుకుని నటుడిగా నిర్మాతగా కన్నా వైరల్ స్పీచుల ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న బండ్ల గణేష్ ఈ మధ్య సినిమా వ్యవహారాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం మహా యాక్టివ్ గా ఉంటారు. తనను ట్యాగ్ చేసినవాళ్లుకు స్వయంగా సమాధానం ఇవ్వడం చాలా సార్లు చూడచ్చు. అప్పుడప్పుడు వివాదాస్పదం అనిపించే విషయాల జోలికి వెళ్లడం, తీరా అది ముదిరాక సారీ చెప్పేసి తిరిగి సైలెంట్ అయిపోవడం సర్వ సాధారణం అయిపోయింది. తాజాగా ఆహా టాక్ షో మరోసారి బండ్ల గణేష్ ని ట్విట్టర్ లో హాట్ డిస్కషన్ గా మార్చేసింది

ఆ ఎపిసోడ్ లో బాలకృష్ణ అడిగిన అడిగిన ఓ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ గబ్బర్ సింగ్ కి ప్రొడ్యూసర్ గా బండ్ల గణేష్ తాను అడిగినంత ఇవ్వలేదని అటువైపు అతను అనుకున్నది ఇచ్చాడని చెప్పారు. అంటే దానర్థం సరైన రెమ్యునరేషన్ అందలేదనేది అభిమానుల వెర్షన్. దీంతో కొందరు ట్విట్టర్ వేదికగా నిలదీయడం మొదలుపెట్టారు. మోసం చేశావా అని ఒకరు, ఇప్పుడైనా బ్యాలన్స్ జనసేన పార్టీకి డొనేషన్ ఇవ్వమని మరొకరు ఇలా రకరకాలుగా ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. అన్నిటికి రిప్లై ఇస్తున్న బండ్ల ఏకంగా నన్ను రెచ్చగొట్టకండి విశ్వరూపం చూపిస్తా అనేశారు.

ఈ పరిణామాల కన్నా ముందు భక్తుడిగా నేను ఏమి ఇచ్చినా దేవుడు తీసుకుంటాడని చెప్పిన బండ్ల గణేష్ తాజాగా స్వరం మార్చేశారు. సరే ఇప్పుడేదో పవన్ కు యాంటీ అయిపోతాడని కాదు కానీ అనవసరమైన చర్చకు ఇది దారి తీస్తోంది. పైగా ఫేక్ ఐడిలతో కొందరు రెచ్చగొడుతున్న తీరుకి స్పందించడం పట్ల వ్యవహారం వివాదం అవుతుంది తప్ప ఇంకేమీ రాదు. అలాంటప్పుడు వాటిని చూసి చూడనట్టు వదిలేస్తే పోయేది. ఎప్పుడో పదేళ్ల కింద వచ్చిన గబ్బర్ సింగ్ గురించి పవన్ సరదాగా అన్నారో సీరియస్ గా అన్నారో చూసుకోకుండా దాని మీద ఇంత రాద్ధాంతం చేయడం అనవసరం