ఆయన స్టార్ డైరెక్టర్లకు గురువు

టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. 80, 90 దశకాల్లో సినిమాలను అనుసరించిన వారికి సాగర్ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పట్లో టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్లలో ఆయనొకరు.

సూపర్ స్టార్ కృష్ణకు లేటు వయసులో ‘అమ్మ దొంగా’ లాంటి సూపర్ హిట్ ఇచ్చి హీరోగా ఆయన కెరీర్‌కు మరింత పొడిగింపు ఇచ్చిన దర్శకుడు సాగర్. ఆయన ఇంకా రామసక్కనోడు, ఓసి నా మరదలా, స్టూవర్టుపురం దొంగలు, రాకాసి లోయ లాంటి సినిమాలు తీశారు. ఐతే దర్శకుడిగా సాగర్ తెచ్చుకున్న పాపులారిటీకి మంచి తన శిష్యుల ద్వారా తెచ్చుకున్న పేరు ఎక్కువ. టాలీవుడ్‌కు ఇద్దరు టాప్ డైరెక్టర్లను అందించిన ఘనత సాగర్ సొంతం. ఆ ఇద్దరు దర్శకులు వి.వి.వినాయక్, శ్రీను వైట్ల కావడం విశేషం.

ముందు వినాయక్, శ్రీను వైట్ల ఇద్దరూ కూడా ఈవీవీ సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా ప్రయాణం మొదలుపెట్టారు. కానీ అక్కడ చాలా మంది అసిస్టెంట్లు ఉండడంతో పని పెద్దగా నేర్చుకునే అవకాశం లేదని.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సాగర్ దగ్గరికి వచ్చేశారు. ఆయన దగ్గర కొన్నేళ్ల పాటు పని చేశారు. ఆపై శ్రీను వైట్ల, వినాయక్ ఒకరి తర్వాత ఒకరు దర్శకులుగా మారారు.

ఇద్దరూ మంచి పేరు తెచ్చుకున్నాక పలు సందర్భాల్లో తమ గురువు సాగర్ అని ఆయన గురించి గొప్పగా మాట్లాడారు. సాగర్ దర్శకత్వం ఆపేశాక కూడా తన శిష్యుల వల్లే వార్తల్లో ఉండేవారు. వారి సినిమాల వేడుకల్లో కనిపించేవారు. శ్రీను వైట్ల, వినాయక్ మాత్రమే కాదు.. మరో పేరున్న దర్శకుడు కూడా సాగర్ శిష్యుడే. అతనే.. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలతో రవికుమార్ మంచి పేరు సంపాదించిన సంగతి తెలిసిందే.