స్టార్ హీరోలకు సంబంధించినది ఏదైనా సరే క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని వీలైనంత త్వరగా క్యాష్ చేసుకోవాలి. అది సినిమా కావొచ్చు. మరొకటి అవ్వొచ్చు. టైమింగ్ కీలకం. అంతే తప్ప తాపీగా ఉండి తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందామనుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఇది సినిమాలకే కాదు వెబ్ సిరీస్ లకూ వర్తిస్తుంది. వెంకటేష్ రానా కాంబోలో రూపొందిన రానా నాయుడు షూటింగ్ ని నెట్ ఫ్లిక్స్ ఎప్పుడో పూర్తి చేసింది. ఆ మధ్య ఫస్ట్ లుక్కులు, టీజర్ లు కూడా వచ్చాయి. అంతే ఆ తర్వాత మొత్తం సైలెంట్. 2024 షెడ్యూల్ ని డేట్లతో సహా ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ అందులో రానా నాయుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేదు.
అల్లుడు నాగ చైతన్యదీ ఇదే పరిస్థితి. అమెజాన్ ప్రైమ్ కోసం చేసిన వెబ్ సిరీస్ దూత గత కొంత కాలంగా ఏ సౌండూ చేయడం లేదు. విక్రమ్ కె కుమార్ లాంటి అగ్ర దర్శకుడు తీసినా హైప్ ని పెంచడంలో ప్రైమ్ ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. ఈ కాంబోలో వచ్చిన థాంక్ యు డిజాస్టర్ ఫలితం వల్ల కొంత వెనుకడుగు వేసిందేమోననే టాక్ ఉంది కానీ కేవలం ఆ కారణంగా ఇంత ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. చైతు ఫస్ట్ టైం హారర్ జానర్ ట్రై చేసింది దూతతోనే. దీంతో రానా నాయుడు, దూతలు దసరా నుంచి ఏదో ఒక పండక్కు వస్తాయని ఫ్యాన్స్ ఎదురు చూడటం తీరా ఏ అప్డేట్ లేక ఉసూరుమనడం జరుగుతూ వస్తోంది.
ఫైనల్ గా ఇవి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయనే క్లారిటీ మిస్సవుతోంది. వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చైతు కస్టడీతో బిజీగా ఉన్నాడు. రెండు సీరియస్ జానర్లే. పైన చెప్పిన వెబ్ సిరీస్ లు అంతే. మరి ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మనసులో ఏముందో కానీ ఈ డిలే మాత్రం ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతూ క్రమంగా ఆసక్తి పోయేలా చేస్తోంది. అసలే థియేటర్లకు జనాలు మునుపటిలా బాగా వెళ్తున్న ట్రెండ్ లో వెబ్ సిరీస్ ల తాకిడి తగ్గిపోయింది. హిందీలో ఏమో కానీ తెలుగులో పెద్దగా తీయడం లేదు. ఇవి మళ్ళీ పుంజుకోవాలంటే ఇలాంటి స్టార్ హీరోల కంటెంట్ వీలైనంత త్వరగా తీసుకురావాలి.