ప్రభాస్ అన్ని సీక్వెల్స్ ఎలా చేస్తాడు

నిన్న ఉన్నట్టుండి సలార్ తో పాటు ప్రాజెక్ట్ కె కూడా రెండు భాగాలుగా వస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాని ఊపేసింది. దర్శక నిర్మాతలు ఎక్కడా చెప్పకపోయినా ఎవరికి వారు ఊహించేసుకుని ప్రచారం చేయడంతో ఇది కాస్తా వైరల్ అయిపోయింది. కొందరు ఏకంగా ఒక అడుగు ముందుకేసి రిలీజ్ డేట్లు కూడా చెప్పేస్తున్నారు. ప్రాజెక్ట్ కె 2024 ఏప్రిల్ ఆ తర్వాత కొనసాగింపు భాగం మరుసటి ఏడాది వస్తుందట. ఇంతకన్నా పెద్ద జోక్ మరొకటి ఉండదు. ఎందుకంటే ఆది పురుష్, సలార్ లు ముందు చెప్పిన తేదీలకే కట్టుబడితే 2023 జూన్ నుంచి సెప్టెంబర్ అంటే నాలుగు నెలల వ్యవధిలో రెండూ రిలీజవుతాయి.

ఆపై సంక్రాంతికి మారుతీ మూవీ ప్లాన్ చేశారనే టాక్ ఇప్పటికే ఉంది. అలాంటప్పుడు ప్రాజెక్ట్ కె వేసవిలో రావడం అసాధ్యం. ఇంత తక్కువ గ్యాప్ లో అది కూడా ఏడాది లోపే నాలుగు డార్లింగ్ మూవీస్ విడుదల కావడం ఫ్యాన్స్ కి బాగుంటుంది కానీ మార్కెట్ పరంగా అనవసరమైన రిస్క్. అందుకే ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని ఆయా యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నిజంగా ఒకవేళ అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే మేకర్స్ నుంచి అనౌన్స్ మెంట్ వస్తుంది కానీ ఆ సూచనాలేమి లేవు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రాజెక్ట్ కెని టూ పార్ట్స్ గా చేయాలన్న ప్లాన్ దర్శకుడు నాగ అశ్విన్ కి లేనే లేదట.

అటుపక్క సలార్ విషయంలోనూ ఈ అయోమయం నెలకొన్నప్పటికీ ప్రశాంత్ నీల్ ప్లానింగ్ లో ఏముందో బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. కెజిఎఫ్ లాగా ఫైనల్ అవుట్ ఫుట్ చూసుకున్నాక డిసైడ్ చేస్తారా లేక ఒకటే సినిమాగా ఇస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయినా ప్రాక్టికల్ గా చూస్తే ప్రభాస్ ఇప్పుడిచ్చిన కమిమెంట్లకు బాహుబలి లాగా సీక్వెల్స్ చేసేంత టైం లేదు. సందీప్ వంగా స్పిరిట్, సిద్దార్థ ఆనంద్ బాలీవుడ్ మూవీ ఇలా వరసగా క్యూ కట్టి ఉన్నాయి. అలాంటప్పుడు అవసరం లేని రిస్క్ తీసుకోడుగా. సో డార్లింగ్ ఫ్యాన్స్ టెన్షన్ పడకుండా రిలాక్స్ అవ్వొచ్చు.