త్రిషకు మాత్రమే ఎలా సాధ్యమయ్యిందో

స్టార్ హీరోలకు వయసుతో సంబంధం ఉండదు. ముప్పైలో ఉన్నా అరవైకి చేరుకున్నా తెరమీద ఆడిపాడేందుకు కుర్ర భామలనే ఇష్టపడతారు ఆడియన్స్. అందుకే ఒకప్పటి వేటగాడుతో మొదలుపెట్టి ఇప్పటి వీరసింహారెడ్డి దాకా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే హీరోయిన్లకు ఈ వెసులుబాటు ఉండదు. మహా అయితే ఒక పది పదిహేనేళ్ళు కెరీర్ ఎంజాయ్ చేశాక ఆ తర్వాత ఆటోమేటిక్ గా తల్లి వదిన అత్తయ్య లాంటి సపోరింగ్ రోల్స్ కు వచ్చేయాల్సిందే. ఒకప్పుడు వెలిగిన రోజా, రమ్యకృష్ణ, మీనాలు ఇప్పుడు ఎలాంటి పాత్రలకు పరిమితమయ్యారో చూస్తున్నాం.

కొందరు మాత్రమే దీనికి రివర్స్ లో వెళ్తారు. వాళ్ళలో మొదటి పేరు త్రిషదే. ఎందుకంటే 2002లో పరిశ్రమకు వచ్చిన ఈ వర్షం బ్యూటీ రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. అయినా విజయ్ లాంటి అగ్ర హీరో సరసన అవకాశం రావడం అంటే మాటలు కాదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఇంకా టైటిల్ ఖరారు చేయని తలపతి 67లో ప్రియా ఆనంద్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. గతంలో ఈ జంట ఒక్కడు తమిళ రీమేక్ గిల్లిలో ఓ రేంజ్ లో సందడి చేసింది. అపడి పోడు పోడు పాట జనాన్ని మాములుగా ఊపేయలేదు. దాన్నే రవితేజ కృష్ణలో తిరిగి ఇదే త్రిష మీద వాడుకున్నారు.

టాలీవుడ్ లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, కింగ్ లాంటి ఎన్నో హిట్స్ లో హీరోయిన్ గా నటించిన త్రిష ఆఖరిసారి తెలుగులో చేసిన స్ట్రెయిట్ సినిమాలు బాలకృష్ణ లయన్, సోలో హీరోయిన్ గా నటించిన నాయకి. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఇటీవలే పొన్నియన్ సెల్వన్ డబ్బింగ్ లో మెప్పించింది. మాస్టర్ తర్వాత విజయ్ లోకేష్ కాంబోలో రూపొందుతున్న మూవీ కావడంతో దీని మీద అంచనాలు అప్పుడే ఓ రేంజ్ లో ఉన్నాయి. సంజయ్ దత్, అర్జున్ లాంటి టాప్ మోస్ట్ క్యాస్టింగ్ ఉంటే హైప్ ఈ రేంజ్ లో పెరగక ఏమవుతుంది.