గతాన్ని వెనక్కు తిరిగి తీసుకురాలేం కానీ అందులోని గొప్పదనాన్ని ఖచ్చితంగా ఇప్పటి తరాలకు చూపించవచ్చు. ముఖ్యంగా సినిమా అంటే మల్టీ ప్లెక్స్ ఎక్స్ పీరియన్స్, అయిదు వందల రూపాయల పాప్ కార్న్, రెండు మూడు వారాల రన్ అనుకుంటున్న జనరేషన్ కి లెజెండరీ వర్క్ అంటే ఏంటో తెలియజెప్పాలి. దానికి నెట్ ఫ్లిక్స్ శ్రీకారం చుట్టింది. ది రొమాంటిక్స్ పేరుతో రూపొందించిన నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ త్వరలో విడుదల చేయబోతోంది. ఇందులో విశేషం ఏముందంటారా. సుప్రసిద్ధ బాలీవుడ్ దర్శక నిర్మాత యష్ చోప్రా క్లాసిక్స్ గురించిన అరుదైన విశేషాలను ఇందులో చూపించబోతున్నారు.
ఇండియన్ మూవీ హిస్టరీని గొప్ప మలుపు తిప్పిన చాందిని, లమ్హే, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, కాలా పత్తర్, కభీ కభీ, సిల్శిలా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని వాటిలో నటించిన నటీనటుల ద్వారా వాళ్ళ అనుభవాలను చెప్పించబోతున్నారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, రన్బీర్ కపూర్, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, జుహీ చావ్లా, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ దివంగత రిషి కపూర్ తదితరుల ఎక్స్ పీరియన్స్ ని గొప్పగా ఆవిష్కరించబోతోంది. పాతికేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో మీడియా కెమెరాకు ఇంటర్వ్యూ ఇవ్వని ఆదిత్య చోప్రా మొదటిసారి మాట్లాడబోతున్నారు.
ట్రైలర్ చూస్తేనే చాలా నోస్టాల్జిక్ గా అనిపిస్తోంది. మనదగ్గరా ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. వంద సినిమాలు డైరెక్ట్ చేసిన దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ లాంటి వాళ్ళ అనుభవాలను బ్రతికున్న వాళ్ళ రూపంలో పాఠాలుగా చెప్పించాలి. అద్భుతమైన హాస్యంతో చిరస్థాయిగా పేరు నిలుపుకున్న జంధ్యాల ఆణిముత్యాలను ఈ తరహాలో రీ క్రియేట్ చేయాలి. అంత చొరవ ఇండస్ట్రీ జనాలు తీసుకున్నా తీసుకోకపోయినా ఆహా లాంటి ఓటిటిలు నడుం బిగిస్తే ఇదేమీ అసాధ్యం కాదు. ఎందుకంటే యష్ చోప్రాని తలపించే గొప్ప రొమాంటిక్స్ మన దగ్గరా బోలెడు ఉన్నాయి. గుర్తించాలంతే .