సమయం లేదు మిత్రమా రణమా మరణమా అన్నట్టుంది పవన్ కళ్యాణ్ పరిస్థితి. వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. జనసేన పాత్ర కీలకంగా మారుతున్న తరుణంలో వరసగా సినిమాలు ఒప్పేసుకోవడం ఇండస్ట్రీలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోనూ పెద్ద చర్చకే దారి తీస్తోంది. పార్టీ వ్యవహారాలు నడిపించడానికి కావాల్సిన నిధుల కోసం మేకప్ వేసుకోవాల్సి వస్తున్నప్పటికీ వాటి వల్ల పెరుగుతున్న బండెడు బరువు అంత సులభంగా మోసేది కాదు. హరిహర వీరమల్లు ఎప్పుడు పూర్తవుతుందో అంతు చిక్కడం లేదు. బ్రేక్ ఇచ్చారు. వేసవిలో రిలీజయ్యే ఛాన్స్ దాదాపు లేనట్టే. దాని గెటప్ నుంచి పవన్ బయటికి వచ్చేశాడు.
ఆ మధ్య హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలుపెట్టాడు. తాజాగా సుజిత్ తో ఓజి స్టార్ట్ అయ్యింది. వచ్చే వారం సముతిరఖనితో లాక్ చేసిన వినోదయ సితం రీమేక్ షురూ కాబోతోంది. ఇవి కాకుండా సురేందర్ రెడ్డి వెయిటింగ్ లిస్టులో ఉన్నాడు. తనకు నో చెప్పాడా లేక ఆగమన్నాడా అనేది ఇంకా తెలియలేదు. పైన చెప్పిన నాలుగు ఫినిష్ చేయడానికే ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేం. ఒక్కో దానికి చాలా తక్కువ కాల్ షీట్స్ ఇచ్చాడని అందుకే వేగంగా అయిపోతాయని అంటున్నారు కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతిసారి తనకు అనుకూలంగా ఉండవుగా. పైగా రెండు పడవల ప్రయాణం చాలా రిస్క్.
సరే ఉన్నవాటిలో రెండు రీమేకులు ఉన్నాయి కాబట్టి టెన్షన్ అక్కర్లేదని ఫ్యాన్స్ సర్దిచెప్పుకుంటున్నారు కానీ పవన్ చేతిలో ఉన్న అతి తక్కువ సమయంలో వీటిని ఎలా బ్యాలన్స్ చేస్తాడనేది పెద్ద సవాలే. ఒకపక్క జనసేన మీటింగులు, సేవా కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలు, పొత్తుల వ్యవహారాలు, నియోజకవర్గాల టికెట్ల పంచాయితీలు మరోవైపు సినిమాల డిస్కషన్లు, కాల్ షీట్లు, అడ్జస్ట్ మెంట్లు, డేట్లు, ప్రమోషన్లు ఇలా ఇన్నేసి చుట్టుముడితే తట్టుకోవడం చిన్న విషయం కాదు. ఇవన్నీ కాక వారాహి వాహనంతో ప్లాన్ చేసుకున్న యాత్ర ఇంకో ఛాలెంజ్. చుట్టుముట్టిన సవాళ్ల మధ్య పవన్ సినిమాని మించిన ఫైట్ బయట కూడా చేయాల్సి వస్తోంది .