ఆశాశైనీని తీవ్రంగా, కొట్టి హింసించిన నిర్మాత

ఆశాశైని అలియాస్ ఫ్లోరా సైని.. కొంచెం ముందుతరం తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ప్రేమకోసం’ అనే లవ్ స్టోరీతో కథానాయికగా పరిచయం అయిన ఆమె.. ఆ తర్వాత చాలా వరకు చిన్నస్థాయి, స్పెషల్ రోల్సే చేసింది. చాలాబాగుంది, నరసింహనాయుడు, నువ్వునాకు నచ్చావ్, ప్రేమతో రా.. ఇలా పలు తెలుగు చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత వేర్వేరు భాషల్లోనూ నటించింది.

ప్రస్తుతం హిందీలో కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్న ఆశాశైని.. తాను కొత్త రిలేషన్‌షిప్‌లోకి వెళ్లినట్లు వెల్లడించింది. ఈ బంధానికి అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ.. గతంలో తాను ఒక నిర్మాతతో ప్రేమలో పడడం వల్ల ఎదుర్కొన్న హింస గురించి వెల్లడించింది. ఆ రిలేషన్‌షిప్ వల్ల 14 నెలల పాటు నరకం చూశానని.. ఆ నిర్మాత తనను తీవ్రంగా హింసించాడని తెలిపింది. ఈ మేరకు ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అందులో ఆమె ఏమందంటే..

‘‘20 ఏళ్ల వయసులో కెరీర్ పరంగా నేను మంచి స్థితిలో ఉన్నాను. అప్పటికే పది సినిమాల్లో నటించాను. ఎన్నో డిజైనర్ బ్రాండ్ల కోసం మోడల్‌గా పని చేశాను. ఐతే అదే సమయంలో ఒక నిర్మాతతో ప్రేమలో పడ్డాను. కొన్ని రోజులకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతను నన్ను తీవ్ర వేధింపులకు గురి చేశాడు. నా ముఖం, ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టడం మొదలుపెట్టాడు. నా ఫోన్ లాక్కున్నాడు. సినిమాల్లో నటించొద్దని షరతులు పెట్టాడు. 14 నెలల పాటు ఎవ్వరితోనూ మాట్లాడనివ్వలేదు. ఒక రోజు నా పొట్టపై తన్నాడు. ఆ బాధ భరించలేక అక్కడి నుంచి పారిపోయాను. అమ్మానాన్నలను కలిసి వారితోనే ఉన్నాను.

ఆ నిర్మాత వల్ల నేను ఎదుర్కొన్న శారీరక, మానసిక వేదన నుంచి బయటపడ్డానికి కొన్ని నెలల సమయం పట్టింది. తర్వాత మళ్లీ సినీ రంగంలోకి వచ్చాను. పరిస్థితులు చక్కబడడానికి సమయం పట్టినప్పటికీ ఇప్పుడు సంతోషంగానే ఉన్నా. కొత్తగా మళ్లీ ప్రేమ బంధంలోకి వచ్చాను. నాకు అందరి ఆశీస్సులు కావాలి’’ అని ఆశాసైని పేర్కొంది.