రిపోర్టర్ కాదు బాబోయ్ టార్చర్

కొన్ని సినిమాలు థియేటర్లకు రాకపోవడమే మంచిది. కనీసం డిజిటల్ ఖర్చులు కూడా వెనక్కు తెలీనంత వీక్ గా కంటెంట్ ఉన్నప్పుడు ఓటిటి దారి చూసుకోవడం ఉత్తమం. నిర్మాతకు నష్టం తప్పడంతో పాటు కాసింత మనఃశాంతి కూడా దొరుకుతుంది. గత నెల డిసెంబర్ 30 తమిళంలో త్రిష టైటిల్ రోల్ పోషించిన రాంగి విడుదలయ్యింది. తెలుగు డబ్బింగ్ కూడా చేశారు కానీ ఏవో కారణాల వల్ల ఒరిజినల్ వెర్షన్ తో పాటు రిలీజ్ చేయలేకపోయారు. అక్కడ చూస్తే బొమ్మ డిజాస్టర్ కొట్టింది. టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి ఉండటంతో ఈ ఫ్లాప్ మూవీని వదిలి ఎందుకు ఇబ్బంది పడాలని నిర్మాత సైలెంట్ అయ్యారు.

ఇప్పుడిది నేరుగా ఓటిటిలో వచ్చేసింది. త్రిషకు మన దగ్గరా మంచి ఫాలోయింగే ఉంది. చిరంజీవితో మొదలుపెట్టి ప్రభాస్ దాకా దాదాపు అందరి స్టార్ హీరోలతో సూపర్ హిట్ ట్రాక్ రికార్డు తన స్వంతం. ఆ మధ్య గ్యాప్ వచ్చింది కానీ ఇటీవలే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ లో కుందవైగా పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చేసింది. దీంతో సహజంగానే రాంగి మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రిపోర్టర్ టైటిల్ తో మనకు అనువాదం అందించారు. భయం లేని ఒక లేడీ జర్నలిస్టు సమాజంలోని సున్నితమైన సమస్యల మీద పోరాడుతూ ఉంటుంది. అనుకోకుండా ఆన్ లైన్లో ఓ తీవ్రవాదితో మొదలైన పరిచయం కథను మలుపు తిప్పుతుంది.

దీనికి కథను అందించింది సుప్రసిద్ధ ఏఆర్ మురుగదాస్. దర్శకుడు శరవణన్ తో కలిసి ఈయన ఇచ్చిన ట్రీట్ మెంట్ రిపోర్టర్ ని పూర్తి అసంబద్ధంగా మార్చేసింది. బడ్జెట్ బాగానే ఖర్చు పెట్టినప్పటికీ వీడియో గేమ్స్ ని తలపించే ఫైట్లు, ఏ మాత్రం కన్విసింగ్ గా అనిపించని విచిత్రమైన సంఘటనలు వెరసి దీన్నో టార్చర్ ట్రీట్ గా మార్చేశాయి. త్రిష తన వంతుగా ఎలాంటి లోపం లేకుండా కష్టపడింది కానీ తనకు మద్దతుగా సరైన కంటెంట్ లేకపోయింది. టెక్నికల్ సపోర్ట్ బాగానే ఉన్నప్పటికీ సిల్లీ కథా కథనాలతో రిపోర్టర్ ని త్రిష హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం అంత సులభంగా తట్టుకోలేరు.