నారా లోకేష్ ‘యువగళం’ కార్యక్రమంలో తొలి రోజు పాల్గొన్న సందర్భంగా నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోవడం.. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమించడం.. తర్వాతి రోజు బెంగళూరులోని నారాయణ హృదయాలయకు ఆయన్ని తరలించి చికిత్స అందిస్తుండడం తెలిసిందే. రెండో రోజు వచ్చిన వార్తలు, హెల్త్ అప్‌డేట్‌ను బట్టి చూస్తే తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉందని స్పష్టమైంది. ఒక దశలో ఆయన బతకడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
గుండె వాల్వ్ 90 శాతం మూసుకుపోయిందని.. శరీరం నీలిరంగులోకి మారిందని.. అంతర్గత రక్తస్రావం జరిగిందని.. కృత్రిమ శ్వాస అందించాల్సిన పరిస్థితి తలెత్తిందని వచ్చిన వార్తలతో నందమూరి, తెలుగుదేశం అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందో అని భయపడ్డారు. ఐతే గత రెండు రోజుల పరిణామాలను బట్టి చూస్తే తారకరత్న పరిస్థితి కొంచెం మెరుగుపడ్డట్లే కనిపిస్తోంది.
బాలకృష్ణ, ఎన్టీఆర్, శివరాజ్ కుమార్.. ఈ ముగ్గురూ మీడియాతో మాట్లాడుతూ పరిస్థితి కొంచెం ఆశాజనకంగా ఉందనే అన్నారు. ఐతే తారక్ అన్నదాన్ని బట్టి చూస్తే పరిస్థితి కొంచెం మెరుగుపడింది తప్ప తారకరత్న ప్రమాదం నుంచి అయితే బయటపడలేదన్నది స్పష్టం. చికిత్సకు తారకరత్న శరీరం స్పందిస్తుండడం మంచి పరిణామం.
తారకరత్నకు రకరకాల పరీక్షలు చేసిన వైద్యులు 48 గంటల అబ్జర్వేషన్లో ఉంచారు. ఆ గడువు పూర్తయింది. ఇప్పుడు మళ్లీ అన్ని పరీక్షలు రిపీట్ చేయబోతున్నారట. వాటి రిపోర్ట్స్ ఆధారంగా తారకరత్న పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత వస్తుంది. మొత్తానికి తాజా అప్‌డేట్స్ ప్రకారం తారకరత్న రెండో రోజు ఉన్నంత విషమ స్థితిలో లేడు. కానీ ఇలా మృత్యు అంచుల్లోకి వెళ్లిన వారికి మళ్లీ ఏ సమయంలో అయినా పరిస్థితి విషమించవచ్చు. ఎంతోమంది ప్రముఖుల విషయంలో ఇలాంటి అనుభవాలు చూశాం. కాబట్టి తారకరత్న విషయంలో ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అంతకంటే ముందు పరీక్షల అనంతరం రిలీజ్ చేసే హెల్త్ అప్‌డేట్ ఏంటో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates