మహేష్ బన్నీలకు మళ్ళీ లీకుల గొడవ

పాతికేళ్ల క్రితం ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు మీడియాకు అభిమానులకు ఎంట్రీ సులభంగానే దొరికేది. దర్శక నిర్మాతలు దగ్గరుండి జరుగుతున్న చిత్రీకరణ తాలూకు విశేషాలు చెప్పి ఫోటోలు తీయించి పంపేవారు. కీలకమైన సీన్లు పాటలకు సంబంధించిన లీక్స్ ఓపెన్ గానే షేర్ చేసుకునేవారు. ఎందుకంటే అప్పుడు సెల్ ఫోన్లు లేవు టెక్నాలజీ లేదు. ఏం జరుగుతోందో యూనిట్ లో పని చేసే వాళ్ళు చెబితే తప్ప బయటికి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు హై ఎండ్ స్మార్ట్ ఫోన్లు వచ్చాక మొత్తం మారిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏకంగా వీడియోలు బయటికి వెళ్లిపోతున్నాయి.

తాజాగా వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 తాలూకు టైటిల్ సాంగ్ ట్రాక్ ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఇది షూట్ జరుగుతున్న టైంలో రికార్డు చేసిన ఆడియోగా చెబుతున్నారు. తగ్గదేలే లీడ్ వర్డ్ తో ఉన్న లిరిక్స్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఇది కాక బన్నీ స్టిల్స్ రెండు మూడు బయట తిరుగుతున్నాయి. మరోవైపు మహేష్ బాబు 28 సైతం ఇదే సమస్యతో ఇబ్బంది పడుతోంది. హైదరాబాద్ షెడ్యూల్ లో జరిగిన యాక్షన్ ఎపిసోడ్ బ్రేక్ లో మహేష్ నిలుచున్న ఫోజు, సూచనలు వింటున్న పిక్స్ బయటికి వచ్చాయి. ఇది అక్కడి సభ్యుల పనేనని వేరే చెప్పనక్కర్లేదు.

సలార్ వి ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా ఆన్ ది సెట్స్ వీడియోలు వదులుతున్నారు. దీనికి కారణం ఎవరైనా ఇలాంటి ప్యాన్ ఇండియా సినిమాల ఎగ్జైట్ మెంట్ లెవెల్స్ ని ఫ్యాన్సే తగ్గించేస్తున్నారు. ఫస్ట్ లుక్ తో మొదలుపెట్టి ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ నిర్మాతలకు లక్షలు కోట్లు విలువ చేస్తుంది. అలాంటిది ఇలా సింపుల్ గా వదిలేస్తే నష్టపోయేది అభిమానులు కాదు. రాజమౌళి అంతటి మాస్టర్ బ్రెయినే స్పాట్ లోకి ఎవరూ సెల్ ఫోన్లు తేకుండా నిషేధించినా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లీక్స్ ని ఆపలేకపోయారు. ఎంత కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నా వీటిని నిలువరించడం ఎలాగో అంతు చిక్కడం లేదు.