సోషల్ మీడియా నుంచి రోడ్ల దాకా వెళ్లిపోయారు

ఏదైనా మితంగా ఉండాలి. అతిగా మారితే అనర్థాలు జరుగుతాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్ యుద్ధాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇప్పటిదాకా కేవలం ఆన్ లైన్ ట్రోల్స్ కే పరిమితమైన దురాభిమానులు ఇప్పుడు ఏకంగా రోడ్లకు వచ్చేస్తున్నారు.

అర్థం లేని ఛాలెంజులతో కవ్వించుకుంటూ వీడియోలు మీమ్స్ తో మరికొందరిని రెచ్చగొడుతున్నారు. ఇది ఎంత దూరం వెళ్లిందంటే సరదా కోసమో సీరియస్ గా చేద్దామనో, ఉద్దేశం ఏదైనా సరే హద్దులు మీరి వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లేలా ఉంది. హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటే గ్రౌండ్ లెవెల్ లో ఫ్యాన్స్ ఇంకో రకంగా ఉంటున్నారు.

నిన్న ట్విట్టర్ లో ప్రభాస్ మహేష్ బాబు అభిమానులు పరస్పరం రెచ్చగొట్టుకునేలా ట్వీట్లు పెట్టుకున్నారు. వీళ్ళలో ఒకడు నేరుగా కలుసుకుని కొట్టుకుందామని రెచ్చగొట్టి ఓ షాపింగ్ మాల్ కు వెళ్లి ఫోటో పెట్టాడు. దీనికి స్పందించిన అవతలి హీరో ఫ్యాన్ వస్తున్నా కాచుకో మంటూ ఏకంగా లొకేషన్ కూడా షేర్ చేశాడు.

ఇదంతా బెంగళూరులో జరిగింది. ఈ ఇద్దరిని చూసి అచ్చం ఇదే తరహా సీన్ ని హైదరాబాద్ శ్రీరాములు థియేటర్ దగ్గర రిపీట్ చేశారు. ట్విస్టు ఏంటంటే రెండు సందర్భాల్లోనూ రెండో వాడు రాలేదు. ఒక్కరే వచ్చి హంగామా చేయడం మీసాలు తిప్పి తొడలు కొట్టడం జరిగిపోయింది.

ఇదంతా పనీపాటా లేని వ్యవహారమే. ఒకప్పుడు పోస్టర్ల మీద పేడ కొట్టి లేదా వాటిని చింపేసి తమ ఈగోలను సంతృప్తి పరుచుకునే స్టేజి నుంచి ఏకంగా ఆన్ లైన్ లో రారా చూసుకుందాం అనే స్టేజి దాకా ఎదిగిపోయారు. ఆయా సందర్భాలకు తగ్గట్టు చరణ్ తారక్ పవన్ బన్నీ ఇలా అందరి అభిమానులు ఒక్కోసారి ఇలాంటి వార్స్ లో భాగమైనవాళ్లే. స్క్రీన్ పైనేమో స్టార్లు కలిసి డాన్సులు చేస్తున్నారు, ఫైట్లు చేస్తున్నారు, ఒకే స్టేజి మీద కౌగిలించుకుని ఆప్యాయత చూపిస్తున్నారు. కానీ వీళ్ళను ఇష్టపడే వాళ్ళ తీరేమో ఇలా ఉంది. అయినా చదువు కెరీర్ మీద దృష్టి పెట్టక ఇవేం బుద్దులని నెటిజెన్లు ఈసడించుకుంటున్నారు