మూడేళ్లుగా లెక్క తప్పుతోంది

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అనే టైటిల్ పోస్టర్ మీద పడిందంటే చాలు ప్రేక్షకులకు ఓ మంచి ఉత్తమ సినిమా చూడబోతున్నామనే భరోసా కలిగేది. అందుకే ఒకప్పుడు హీరోలకు , దర్శకులకు సమానంగా దిల్ రాజు కి కూడా నిర్మాతగా ఓ ఇమేజ్ ఉండేది. హీరోలు కూడా దిల్ రాజు బేనర్ లో సినిమా అంటే హిట్ కొట్టినట్టే అనే నమ్మకం ఉండేది. కానీ రాను రాను దిల్ రాజు జడ్జిమెంట్ మిస్ అవుతూ వస్తున్నాడు. థియేటర్స్ లో ఏ రేంజ్ లో ఆడుతుందో కథ వినగానే అంచనా వేసేసి వరుస సక్సెస్ లు అందుకున్న దిల్ రాజు ఇప్పుడు ఆ అంచనా వేయలేక వరుస అపజయాలతో ముందుకు నడుస్తున్నారు.

దిల్ రాజు జడ్జిమెంట్ మిస్ అయిందని అందరూ చెప్పుకున్న మొదటి సినిమా ‘జాను’. అవును తమిళ్ లో సూపర్ హిట్టయిన 96 ను చూసి ఎగ్జైట్ మెంట్ లో రైట్స్ తీసేసుకొని ఇక్కడ స్టార్లకు షోలు వేసి వారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు దిల్ రాజు. ముందు బన్నీ, తర్వాత నాని ఇలా చాలా మంది హీరోలను జాను కోసం సంప్రదించి రీమేక్ చేసే ఆలోచన మొదలు పెట్టి ఫైనల్ గా శర్వానంద్ , సమంత లను ఒప్పించి మక్కీ కీ మక్కీ తీసి బోల్తా కొట్టారు. నిజానికి 96 లో కొత్త కథ లేదు. మనం తెలుగులో చూసేసిన కొన్ని కథల సమ్మోహనమే. కానీ తమిళ్ లో ఆ సినిమా క్లిక్ అవ్వడానికి రీజన్ అక్కడ కాస్టింగ్ బాగా కుదిరింది. విజయ్ సేతుపతి , త్రిషలు ఆ పాత్రలను పండించిన తీరు సినిమాను నిలబెట్టింది. మ్యూజిక్ కీ రోల్ పోషించింది. అవన్నీ ఆలోచించకుండా తెలుగులో దాన్ని రీమేక్ చేసి మిస్ ఫైర్ అయ్యాడు దిల్ రాజు.

ఇక ఆ తర్వాత ‘V , రౌడీ బాయ్స్ , థాంక్యూ ఇలా వరుసగా దిల్ రాజు నుండి వచ్చిన సినిమాలు అపజయాలు అందుకున్నాయి. వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తో ఏదో పాస్ అనిపించుకుంది. ఇక తాజాగా వారసుడు రిజల్ట్ ఏమైందో తెలిసిందే. తమిళ్ లో విజయ్ కున్న క్రేజ్ తో సినిమా బాగా ఆడింది కానీ తెలుగులో వర్కవుట్ అవ్వలేదు. అసలు దిల్ రాజు తన సినిమాల్లో చూసేసిన కంటెంట్ తోనే ఈ సినిమాను ఎలా నిర్మించాడు ?? అనే ప్రశ్న తెలుగు ప్రేక్షకులకు ఎదురైంది.

ఏదేమైనా వకీల్ సాబ్ , ఎఫ్ 3 వంటి యావరేజ్ లు పక్కనపెడితే దిల్ రాజు ప్రాపర్ సక్సెస్ అందుకొని మూడేళ్ళవుతోంది. F2 తర్వాత దిల్ రాజు బ్లాక్ బస్టర్ కొట్టింది లేదు. మరి ఇకనైనా దిల్ రాజు తన జడ్జిమెంట్ మీద దృష్టి పెట్టి మునపటిలా ఉత్తమ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తే బాగుంటుంది. లేదంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన నిర్మాతలు ముందుకెళ్తుంటే దిల్ రాజు మాత్రం వెనక్కి వెళ్లిపోతారు. రామ్ చరణ్ సినిమాతో SVC కి మళ్ళీ బిగ్గెస్ట్ హిట్ వస్తుందేమో చూడాలి.