సీనియర్ సినీ నటి జమున ఇక లేరు

పురాణాల్లో చదువుకున్న సత్యభామ ఎలా ఉంటుంది? ఆమె మన ముందు ప్రత్యక్షమైతే.. ఆ కోపం.. ఆ ఉక్రోషం.. అంతలోనే ప్రేమాభిమానాల్ని ప్రదర్శించే ఆమెను కళ్లకు కట్టినట్లుగా చూపించిన నటి ఎవరైనా ఉన్నారంటే.. అది సీనియర్ నటి జమునకు మాత్రమే దక్కింది. అలాంటి ఆమె(86).. ఇక లేరు. తన నటనతో తెలుగు ప్రజలకు దగ్గరైన ఆమె.. ఈ రోజు కన్నుమూశారు. గడిచిన కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె.. తన ఇంట్లోనే తుదిశ్వాసను విడిచారు.

అల్లరి పిల్ల పాత్ర కావొచ్చు.. ఉక్రోషాన్ని ప్రదర్శించే మరదలి క్యారెక్టర్ లో కావొచ్చు.. సంపన్నురాలైన అమ్మాయిగా కావొచ్చు.. ఇల్లాలు అంటే ఇలానే ఉండాలి అన్నట్లుగా అటు పౌరాణికాల్లో కావొచ్చు. ఇటు జానపద.. సాంఘికాల్లో కావొచ్చు. సినిమా ఏదైనా.. పాత్ర మరేదైనా.. అందులో ఇమిడిపోవటం.. అందులోకి పరకాయ ప్రవేశం చేయటం జమునకే చెల్లింది.

సినిమా హీరోయిన్ అంటే వారి ఇమేజ్ చాలాతక్కువ కాలం ఉంటుంది. అందుకు భిన్నంగా జమున సీనియర్ నటిగా గౌరవాభిమానాల్ని సొంతం చేసుకున్నారు. తెలుగునాట ఎంతో మంది సీనియర్ నటీమణులు ఉన్నా.. వారందరితో పోలిస్తే జమున కాస్త ప్రత్యేకమని చెప్పాలి. 1936 ఆగస్టు 30న హంపీలో జన్మించిన ఆమె.. బాల్యంలో మాత్రం గుంటూరు జిల్లా దుగ్గిరాలలోనే గడిచింది. ఆమె నటించిన తొలి చిత్రం పుట్టిల్లు.

ఎన్టీఆర్.. ఏఎన్నార్.. జగ్గయ్యతో సహా పలువురు అగ్ర హీరోలతో నటించిన ఆమె.. హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. ఆమె పోషించిన పాత్రలు ఎన్ని ఉన్నా.. సత్యభామగా మాత్రం ఆమెకు సాటి వచ్చే వారే లేరని చెప్పాలి. క్రిష్ణుడు.. రాముడు అన్నంతనే ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తారో.. సత్యభామ పేరు చెప్పినంతనే తెలుగు వారి మనసుల్లో గుర్తుకు వచ్చే రూపం జమునదే.

పుట్టిల్లు మూవీతో ఎంట్రీ ఇచ్చినా.. సత్యభామా కలాపంతో ప్రేక్షకుల మనసుల్ని దోచేశారు. నాటకాలతో మొదలు పెట్టి సినిమాల్లో నటించిన ఆమె మొత్తం 198 సినిమాల్లో నటించారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటించిన ఆమెకు పలు అవార్డులు రివార్డులుగా వచ్చాయి. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఆమె ఎంట్రీ ఇచ్చినా.. ఎక్కువ కాలం అందులో ఇమడలేకపోయారు.

1980లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె రాజమండ్రి నుంచి 1989లో లోక్ సభకు ఎన్నియ్యారు. తర్వాతి కాలంలో రాజకీయాలకు దూరమైన ఆమె.. 1990లలో బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగే పలు కార్యక్రమాలకు అతిధిగా పాల్గొంటూ.. హుషారుగా ఉండేవారు. సీనియర్ నటీమణుల్లో ఎంతగా కాలం గడిచినప్పటికీ ఒకేలాంటి గౌరవ మర్యాదల్ని పొందిన అతి కొద్ది మంది నటీమణుల్లో జమున ఒకరిగా చెప్పక తప్పదు.