భారీ అంచనాల మధ్య విడుదలైన పఠాన్ దానికి తగ్గట్టే అంతకు మించి అనేలా ఓపెనింగ్స్ సాధించుకుంది. కథ గురించి కొంత మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ షారుఖ్ ఖాన్ యాక్షన్ అవతారానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. భోజనానికి వెళ్తే ఐస్ క్రీం బోనస్ గా ఇచ్చినట్టు సల్మాన్ ఖాన్ క్యామియో అద్భుతంగా పండటంతో కండల వీరుడి అభిమానులు కూడా ఈ సంబరంలో భాగమవుతున్నారు. నార్త్ లో ఇదంతా సహజమనుకుంటే హైదరాబాద్ విజయవాడలో సైతం బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. వర్కింగ్ డే అయినప్పటికీ ప్రధాన మల్టీ ప్లెక్సులన్నీ హౌస్ ఫుల్ బోర్డులు నమోదు చేస్తున్నాయి.
ఇక్కడ ఇలా ఉంటే ముంబై, ఢిల్లీ, గుర్గావ్, కోల్కతాలో పరిస్థితి అరాచకంగా ఉంది. రిలీజ్ ముందు రోజు మిడ్ నైట్ షోలు వేయడం సహజం కానీ పఠాన్ కి మొదటి రెండు మూడు రోజులు అర్ధరాత్రి ఆటలు ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు పివిఆర్ సంస్థ ఆన్ లైన్ లో టికెట్లు పెట్టడం ఆలస్యం క్షణాల్లో సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకో పది రోజుల వరకు ఉంటుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దగ్గరలో మరో పెద్ద సినిమా ఏదీ లేకపోవడం బాగా కలిసి వచ్చేలా ఉంది. వరస డిజాస్టర్లతో నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న షారుఖ్ కి కోరుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం దక్కేలా ఉంది.
కమర్షియల్ లెక్కలు ఎలా ఉండబోతున్నాయేది కొంచెం వేచి చూశాక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ డే వంద కోట్ల గ్రాస్ సులభంగా అందుకుంటుందని ప్రాధమిక రిపోర్ట్. స్క్రీన్ కౌంట్ మాత్రం ఎప్పటికప్పుడు కంటిన్యూగా పెంచేస్తున్నారు. దీపికా పదుకునే గ్లామర్, రెండు పాటలు, యాక్షన్ ఎపిసోడ్లు క్లాస్ మాస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్ లో వచ్చిన దృశ్యం 2 తర్వాత అక్కడి బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయింది. సర్కస్ ఘోరంగా పోవడంతో బిక్కుబిక్కుమంటున్న హిందీ ఎగ్జిబిటర్లకు ఊపిరి వచ్చినంత పనైంది. కాకపోతే కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ లను దాటడం మాత్రం అంత సులభంగా ఉండదు.