రవితేజ-సిద్ధు జొన్నలగడ్డ కాంబో ఫిక్స్

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం మామూలు ఊపులో లేడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోయే రవితేజకు ఇప్పుడు వరుసగా రెండు పెద్ద హిట్లు పడడంతో ఉత్సాహం రెట్టింపైంది. గత నెలలో ‘ధమాకా’తో సోలో హీరోగా బ్లాక్‌బస్టర్ అందుకున్న మాస్ రాజా.. ఈ నెలలో మల్టీస్టారర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘టైగర్ నాగేశ్వరరావు’తో పాటు ‘రావణాసుర’ అనే మరో సినిమా, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనితో మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ప్రశాంత్ వర్మ చెప్పిన ఓ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. వీటన్నింటికీ తోడు రవితేజ ఒక రీమేక్ మూవీకి కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డతో రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడం విశేషం.

ఈ ప్రాజెక్టు గురించి సీనియర్ దర్శకుడు దశరథ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రవితేజ-సిద్ధు కాంబినేషన్లో ఒక రీమేక్ మూవీకి తనను దర్శకత్వం వహించమని నిర్మాతలు అడిగారని.. కానీ తాను రచనకే పరిమితం అవుతున్నానని దశరథ్ తెలిపాడు. ఇంతకీ ఆ చిత్రం దేనికి రీమేక్, ఈ సినిమాకు దర్శక నిర్మాతలు ఎవరు అన్న విషయాలు దశరథ్ మాట్లాడలేదు. ఐతే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది ‘మానాడు’ రీమేక్ అట.

తమిళంలో శింబు నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ హక్కులు తీసుకుంది. కానీ ‘మానాడు’ తెలుగులోనూ డిజిటల్‌గా రిలీజ్ కావడంతో రీమేక్ మీద సందేహాలు నెలకొన్నాయి. కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి, తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్టు రెడీ చేసుకుని రీమేక్ చేయడానికే సురేష్ ప్రొడక్షన్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. రవితేజ-సిద్ధు జొన్నలగడ్డ.. శింబు-ఎస్.జె.సూర్య పాత్రలను తెలుగులో చేయబోతున్నారని తెలుస్తోంది. కానీ ఈ చిత్రానికి దర్శకుడెవరన్నదే తెలియాల్సి ఉంది.