వరంగల్ గడ్డపై వీరయ్య బాస్ పార్టీ

సంక్రాంతి సినిమాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న వాల్తేరు వీరయ్య నిన్నటితో 200 కోట్ల గ్రాస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నా మైత్రి సంస్థ అధికారికంగా ప్రకటించడంతో డౌట్లు తీరిపోయాయి. వీరసింహారెడ్డి విజయోత్సవం జరిగాక తమ సక్సెస్ మీట్ ఎప్పుడని డిమాండ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కోరిక తీరుస్తూ ఈ 28న వరంగల్ లో గ్రాండ్ బాస్ పార్టీని నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈవెంట్ మేనేజ్ మెంట్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారట. రేపో ఎల్లుండో ప్రకటన వచ్చేస్తుంది.

ఇక్కడ దాకా ప్రయాణం మహా జోరుగా సాగింది కానీ నిన్నటి నుంచి వాల్తేరు వీరయ్య కలెక్షన్లలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా సీడెడ్ వైపు ఇది తీవ్రంగా ఉంది. ఉత్తరాంధ్రలో కలెక్షన్లు స్టడీగా ఉండగా నైజామ్ లో పదకొండో రోజు నుంచి ఆశించిన స్పీడ్ లేదు. పైగా అందరి దృష్టి పఠాన్ రిలీజ్ వైపు వెళ్లిపోవడంతో సహజంగానే దాని ప్రభావం నెంబర్ల మీద పడుతోంది. టికెట్ రేట్ల పెంపుని ఏపీలో నిన్నటి నుంచి మినహాయించుకోవడంతో సాధారణ ధరలే అందుబాటులోకి వచ్చాయి. అయితే హైదరాబాద్ మల్టీ ప్లెక్సుల్లో ఇంకా 295 రూపాయలే ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్లోని దెబ్బ కొడుతోంది.

మరోవైపు యుఎస్ లో 2.2 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేశాక మెగా మూవీ వేగం తగ్గిపోయింది. మహా అయితే 2.5ని టచ్ చేయడం మినహా 3 మిలియన్ అందుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు రాబోయే వీకెండ్ ఏమైనా అనూహ్యంగా పికప్ అయితే చెప్పలేం కానీ లేదంటే కథ క్లైమాక్స్ కు చేరుకుంటుంది. వరంగల్ లో చేయబోయే ఈవెంట్ ఈ మూవీకి ఆఖరుది కానుంది. లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజులు అన్నీ అయిపోయాయి. ఇదొక్కటి చేస్తే మైత్రికి పండగ టెన్షన్ ముగింపుకొస్తుంది. ఆపై ఫిబ్రవరి 10న విడుదల కానున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ తాలూకు వ్యవహారాల్లో బిజీ అయిపోతారు.