పార్టీకి సై తెలుగు ప్రమోషన్లకు నై

కోలీవుడ్ స్టార్ విజయ్ ప్రమోషన్స్ కి వీలైనంత దూరంగా ఉంటాడనే సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందు ఒకే ఒక సారి ప్రమోషన్ కి వస్తానని ముందే అగ్రిమెంట్ ద్వారా క్లియర్ గా చెప్పేస్తాడు. తమిళ దర్శక నిర్మాతలకు ఇదంతా తెలిసిందే. అందుకే విజయ్ వచ్చే ఒకే ఒక్క ఈవెంట్ ను భారీ ఎత్తున చేసి సినిమాకు గ్రాండియర్ లుక్ తీసుకొచ్చే ప్లాన్ చేసుకుంటారు. తెలుగులో రిలీజ్ అయినా విజయ్ హైదరాబాద్ వచ్చి ప్రమోషన్ చేయడు. ఓవరాల్ గా ఒకే ఒక్క ఈవెంట్ తో విజయ్ హీరోగా చేతులు దులిపేసుకొని మరో సినిమాకి షిఫ్ట్ అయిపోతాడు.

‘వారిసు’ విషయంలోనూ అదే జరిగింది. కానీ ఈసారి దిల్ రాజు నిర్మాత, పైగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ కాబట్టి తెలుగులో విజయ్ వచ్చి ప్రమోషన్ చేస్తాడని, ఓ ఈవెంట్ లో పాల్గొంటాడని అందరూ అనుకున్నారు. దిల్ రాజు కూడా రిలీజ్ డేట్ మారింది కాబట్టి విజయ్ గారిని తీసుకొస్తా అంటూ మీడియా అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. దీంతో తెలుగులో విజయ్ ను ఇష్టపడే కొందరు ఫ్యాన్స్ ఫైనల్ గా విజయ్ ప్రమోషన్స్ కి హైదరాబాద్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని మురిసిపోయారు.

కానీ విజయ్ మాత్రం వారసుడు సినిమాను కూడా ప్రతీ సినిమాలానే ట్రీట్ చేశాడు. తెలుగు దర్శక నిర్మాతలు సినిమా తీసినప్పటికీ తెలుగులో విజయ్ ఈ సినిమాకు ప్రమోషన్ చేయలేదు. తాజాగా దిల్ రాజు హైదరాబాద్ లో టీంకు ఓ సక్సెస్ పార్టీ ఇచ్చాడు. అక్కడ అనుకోకుండా విజయ్ ప్రత్యక్ష మయ్యాడు. దీంతో విజయ్ తెలుగులో ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టి పార్టీకి రావడం కొందరు తెలుగు ఫ్యాన్ కి బాధ కలిగిస్తుంది. తమ జేబులో నుండి ఈ తమిళ హీరోకి పెరిగిన టికెట్టు ధర పట్టించుకోకుండా కలెక్షన్స్ ఇస్తే కనీసం ప్రేక్షకుడి కోసమైనా రాకుండా పార్టీకేలా వచ్చాడని కొందరు నెటిజన్లు విజయ్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఏదేమైనా ఇవన్నీ కోలీవుడ్ స్టార్ కి రీచ్ అవుతాయా ? అయినా విజయ్ ఇవన్నీ పట్టించుకుంటాడా ? ఏదేమైనా దిల్ రాజు మాట విజయ్ విషయంలో నెగ్గలేదనేది మాత్రం క్లియర్ గా తెలుస్తోంది.