గోవింద్ చేయలేనిది వీరయ్య చేశాడు

కొన్ని సినిమాల్లో కేరెక్టర్స్ బాగున్నా , కథ ,కథనం వర్కవుట్ అవ్వకపోవడంతో తేడా కొడుతుంటాయి. మెగా స్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అలా తేడా కొట్టాయి. వాటిలో కొన్ని చిరు నటన , కేరెక్టర్స్ క్లిక్ అయినా రిజల్ట్ మాత్రం ఆశించినట్టు రాలేదు. అందులో ‘అందరివాడు’ ఒకటి. యాక్షన్ సినిమాలకు కామెడీ మిక్స్ చేసి హిట్లు కొడుతూ మంచి ఫామ్ లో ఉన్న శ్రీను వైట్లకి ‘అందరివాడు’ రూపంలో మెగా ఛాన్స్ దక్కింది.

చిరంజీవి లాంటి స్టార్ దొరకడంతో శ్రీను వైట్ల కాస్త తడ బడ్డాడు. చిరు కామెడీ టైమింగ్ బేస్ చేసుకొని గోవింద్ అనే మాస్ కామిక్ కేరెక్టర్ రాసుకున్నాడు. రైటర్స్ తో కలిసి ఎమోషన్ సన్నివేశాల మీద కూడా దృష్టి పెట్టాడు. తండ్రి కొడుకుల ఎమోషన్ కొంత పార్ట్ బాగానే వర్కవుట్ అయింది. కానీ సినిమాలో మెలో డ్రామా ఎక్కువైంది , పైగా కొడుకు కేరెక్టర్ కి అంతగా ఇంపార్టెన్స్ దక్కలేదు, ఇక కోడలు కేరెక్టర్ తాలూకు సన్నివేశాలు కూడా నచ్చకపోవడంతో ‘అందరివాడు’ కొందరికే నచ్చాడు. కాకపోతే చిరు గోవింద్ గా చేసే కామెడీ , దేవి సాంగ్స్ సినిమాను ఇప్పటికీ చూసేలా చేస్తాయి.

చిరుతో ‘అందరివాడు’ అంటూ శ్రీను వైట్ల చేయలేనిది, బాబీ ‘వాల్తేరు వీరయ్య’ తో చేసి చూపించాడు. అదే కేరెక్టర్ ని కాస్త ఎక్స్ టెన్షన్ చేసుకున్నాడు. బిల్డప్ ఇంట్రో , యాక్షన్ ఇంకా ఎక్కువ పొందు పరిచాడు. గోవింద్ కేరెక్టర్ కి చిరు వేసిన గెటప్ ను మళ్ళీ రీ క్రియేట్ చేసి కాస్త స్టైలింగ్ చేసుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవినే రిపీట్ చేశాడు. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలానే చూపిస్తూ వింటేజ్ చిరును చూపించాడు. ఆచార్య . గాడ్ ఫాదర్ కలెక్షన్స్ మర్చిపోయే సినిమా ఇచ్చే సరికి వీరయ్య కి విజయం అందించి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఫైనల్ గా వీరయ్య ఇప్పుడు 100 కోట్ల షేర్ క్లబ్ కి చేరుకుంటుంది.

నిజానికి బాబీ వీరయ్య కథ విషయంలో , కేరెక్టర్ విషయంలో ఎక్కువ కష్టపడలేదు. చిరును డైరెక్ట్ చేసిన అందరూ దర్శకుల నుండి ఒక్కో అంశం తీసుకున్నాడు ఎక్కువగా శ్రీను వైట్లను ఫాలో అయ్యి గోవింద్ కేరెక్టర్ నే మళ్ళీ రీ క్రియేట్ చేసి ఫ్యాన్స్ ను అలాగే ప్రేక్షకులను మెప్పించాడు. లాజిక్ లేకపోయినా మేజిక్ చేశాడు. సెకండాఫ్ లో రవితేజ పాత్రను వాడుకొని అందరివాడులో ఎమోషనల్ చిరును గుర్తుచేశాడు. రవితేజ కేరెక్టర్ పండటంతో చిరు ఎమోషనల్ సీన్స్ వీరయ్యకి వర్కవుట్ అయ్యాయి. ఏదేమైనా ఒక టైమ్ లో తనకి వచ్చిన గోల్డెన్ ఛాన్స్ వాడుకొని మెగా హిట్ కొట్టలేకపోయాడు శ్రీను వైట్ల. ఇప్పుడు బాబీ అలాంటి కంటెంట్ తో అదే పాత్రతో 100 కోట్ల మెగా హిట్ అందుకున్నాడు.