మరణంతో ఆడుకునే మైఖేల్ ప్రేమ

Michael - Official Trailer (Telugu) | Sundeep Kishan, Vijay Sethupathi | Ranjit Jeyakodi | Sam CS

పరిశ్రమకు వచ్చి దశాబ్దం ఎప్పుడో గడిచిపోయినా సక్సెస్ ఇంకా చెట్టెక్కి కూర్చున్న సందీప్ కిషన్ ఆశలన్నీ ఫిబ్రవరి 3న విడుదల కాబోయే మైఖేల్ మీదే ఉన్నాయి. క్రేజీ క్యాస్టింగ్ తో తన కెరీర్ లోనే అత్యథిక బడ్జెట్ తో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ కం లవ్ డ్రామా మీద ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. విక్రమ్ తరహా స్టయిలిష్ మేకింగ్ తో పాటు కాన్సెప్ట్ కూడా ఏదో డిఫరెంట్ గా అనిపించడంతో కంటెంట్ మీద బలమైన నమ్మకం కనిపిస్తోంది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన మైఖేల్ లో స్టార్ అట్రాక్షన్ చాలానే ఉంది. ఇందాకే బాలకృష్ణతో ట్రైలర్ లాంచ్ నిర్వహించారు.

కథను చెప్పీ చెప్పకుండా తెలివిగా కట్ చేశారు. జీవితంలో దేనికీ భయపడని ఒక హింసాత్మక మనస్తత్వం మైఖేల్(సందీప్ కిషన్)ది. ప్రేమించిన అమ్మాయి(దివ్యాన్ష కౌశిక్)ని ప్రాణంగా చూసుకునే క్రమంలో ఊహించని ప్రమాదకర వ్యక్తులు, సంఘటనలు ఎదురవుతాయి. అయినా లెక్క చేయడు. చివరికి చంపాల్సి వచ్చినా ముందు వెనుక చూడడు. సాలె పురుగుల లవ్ స్టోరీలో లేడీ స్పైడర్ ఎలాగైతే మగ పురుగు చావుకు కారణమవుతుందో దానికి భిన్నంగా ఇక్కడ మైఖేల్ స్టోరీలో ఎవరెవరో బలి కావాల్సి వస్తుంది. అసలు ఇంతకీ ఇతని జీవితంలో ఎదురైన సవాళ్లు ఏంటి, చివరికతను ఏం చేశాడనేది తెరమీద చూడాలి.

విజువల్స్ లో మంచి ఇంటెన్సిటీ కనిపిస్తోంది. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, అయ్యప్ప పి శర్మ, అనసూయ, గౌతమ్ మీనన్ లాంటి క్వాలిటీ తారాగణంతో కాన్సెప్ట్ ఆద్యంతం ఆసక్తికరంగా కనిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. సామ్ సిఎస్ నేపధ్య సంగీతం డిఫరెంట్ సౌండ్ తో చాలా ఫ్రెష్ గా ఆకట్టుకునేలా ఉంది. కిరణ్ కౌశిక్ ఛాయాగ్రహణం, గాంధీ ఆర్ట్ వర్క్ టెక్నికల్ గా బలాన్ని ఇచ్చాయి. రైటర్ పద్మభూషణ్, బుట్టబొమ్మలతో పోటీ పడనున్న మైఖేల్ కనక ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మరో విక్రమ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.