బుట్టబొమ్మను అందుకే తప్పించారు

సంక్రాంతి సినిమాల హడావిడి క్రమంగా తగ్గుతున్న వేళ రిపబ్లిక్ డే వచ్చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా షారుఖ్ ఖాన్ పఠాన్ జ్వరమే కనిపిస్తోంది. రిలీజ్ కు ఇంకా అయిదు రోజులు ఉండగానే పదిహేను కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు కావడం చూసి బాలీవుడ్ ట్రేడ్ ఆనందం మాములుగా లేదు.

తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ విడుదలకు స్కెచ్ వేశారు. మంచి రన్నింగ్ లో ఉన్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు షోలు తగ్గించి మరీ బాద్షాకు దారి ఇస్తున్నారు. మొదటి రోజు పాజిటివ్ టాక్ టాక్ వస్తే కౌంట్ కంటిన్యూ అవుతుంది లేదంటే సహజంగానే మార్పులుంటాయి.

పఠాన్ కు పోటీగా తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా 26న ఒక్క సుధీర్ బాబు హంట్ మాత్రమే ఉంది. బుట్టబొమ్మ కూడా షెడ్యూల్ చేశారు కానీ ఇప్పుడది వాయిదా పడి ఫిబ్రవరి 4కి వెళ్లిపోయింది. సితార సంస్థకు డిస్ట్రిబ్యూషన్ పరంగా మంచి నెట్ వర్క్ ఉన్నప్పటికీ అనవసరమైన రిస్క్ కి పొదలుచుకోలేదు.

దీనికి థియేటర్లు అందుబాటులో లేకపోవడం ఒక కారణమైతే రెండోది గతంలో దసరా సెలవులను లక్ష్యంగా పెట్టుకుని గాడ్ ఫాదర్, ఘోస్ట్ లతో తలపడటం ఇదే బ్యానర్ నుంచి వచ్చిన స్వాతిముత్యంకి చాలా చాటు చేసింది. కంటెంట్ బాగున్నా జనాలకు చేరలేకపోయింది

అందుకే అన్ని కోణాల్లో ఆలోచించి బుట్టబొమ్మను పోస్ట్ పోన్ చేశారు. మలయాళం హిట్ మూవీ కప్పేలా రీమేక్ గా రూపొందిన ఈ డిఫరెంట్ లవ్ ఎంటర్ టైనర్ లో క్యాస్టింగ్ వీక్ గా ఉండటం అంచనాల మీద ప్రభావం చూపిస్తోంది. టైటిల్ రోల్ పోషించిన అనీఖా సురేంద్రన్ కు తమిళంలో పేరుంది కానీ ఇక్కడింకా గుర్తింపు రాలేదు.

పైగా హీరోలిద్దరూ కొత్త మొహాలే. దీంతో ప్రమోషన్ కోసం ఎక్కువ సమయం అవసరం పడుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరైనా పెద్ద స్టార్ ని తీసుకొస్తే కానీ పని జరిగేలా లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బుట్టబొమ్మను తప్పించడం మంచి పనే