రాజమౌళిని బాధ పెట్టిన ‘నో ఎంట్రీ’

ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్ తరఫున కచ్చితంగా ‘ఆర్ఆర్ఆర్’యే అధికారిక ఎంట్రీగా అవకాశం దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నియమించిన జ్యూరీ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రశంసలు దక్కించుకున్న రాజమౌళి సినిమాను కాదని.. ‘చెల్లే షో’ అనే గుజరాతీ సినిమాను భారత్ తరఫున ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసింది. ఈ విషయమై పరిశ్రమ ప్రముఖులు చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సాధారణ అభిమానుల సంగతైతే చెప్పాల్సిన పని లేదు.

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నా ఆ సినిమాను పక్కన పెట్టడం విమర్శలకు దారి తీసింది. ఐతే ఈ సంగతి పట్టించుకోకుండా చిత్ర బృందం మాత్రం స్వతంత్రంగా వివిధ విభాగాలకు సినిమాను పోటీకి నిలిపింది. జ్యూరీ తమ సినిమాను విస్మరించడంపై ఇప్పటిదాకా రాజమౌళి సహా ‘ఆర్ఆర్ఆర్’ టీంలో ఎవ్వరూ స్పందించింది లేదు.

ఐతే తాజాగా రాజమౌళే ఈ విషయమై పెదవి విప్పాడు. దేశం తరఫున ‘ఆర్ఆర్ఆర్’ అధికారిక ఎంట్రీ దక్కించుకోకపోవడంపై తాను బాధపడ్డట్లు రాజమౌళి వెల్లడించాడు.
‘‘దేశం తరఫున అధికారిక ఎంట్రీ సాధించకపోవడం పట్ల నిరాశ చెందాను. ఐతే ఎంట్రీ ఎందుకు సాధించలేకపోయాం అని అదే విషయం గురించి ఆలోచించే వ్యక్తులం కాదు మేము. జరిగిందేదో జరిగిపోయింది. మనం ముందుకు సాగిపోవాలి. మన దేశం నుంచి ‘చెల్లే షో’ ఆస్కార్‌కు నామినేట్ కావడం, షార్ట్ లిస్ట్ కావడం పట్ల నాకు సంతోషమే. ఆర్ఆర్ఆర్‌ను ఇండియా తరఫున అధికారికంగా నామినేట్ చేసి ఉంటే బాగుంటుందని విదేశీయులు సైతం అనుకుంటున్నారు. కానీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎలా ఆలోచిస్తుంది.. దాని నియమ నిబంధనలేంటి అన్నది నాకు తెలియదు. కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు’’ అని జక్కన్న స్పష్టం చేశాడు. ఆస్కార్ అవార్డుల్లో ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డైరెక్టర్ అవార్డులకు నాటు నాటు, రాజమౌళి ఎంపిక కావచ్చన్న అంచనాలున్నాయి.