పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రీఎంట్రీ తర్వాత రిలీజ్ చేసిన రెండూ కూడా రీమేక్ సినిమాలే. ఐతే వాటితో పోలిస్తే పవన్ అభిమానులు ఎక్కువగా చూడాలని ఆశపడుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’నే. ఎందుకంటే ఆ సినిమాను రూపొందిస్తున్నది క్రిష్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు. పైగా పవన్ కెరీర్లో ఇప్పటిదాకా చేయని పీరియడ్, హిస్టారికల్ మూవీ అది. దీని టీజర్ చూసినపుడే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
పవన్ పొటెన్షియాలిటీని సరిగా ఉపయోగించుకునే సినిమా ఇది అవుతుందని వారు ఆశిస్తున్నారు. కాకపోతే ఈ చిత్రం ఏ ముహూర్తాన పట్టాలెక్కిందో కానీ.. షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ వస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి మేకింగ్ దశలోనే ఉన్న ‘హరిహర వీరమల్లు’ ఇంకా పూర్తి కాలేదు. ఐతే ఈ మధ్య పవన్ రెగ్యులర్‌గా షూటింగ్‌కు హాజరు కావడం.. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కావడంతో టీంతో పాటు అభిమానుల్లోనూ ఉత్సాహం వచ్చింది.
సినిమా ఇంకోసారి వాయిదా పడదని.. చివరగా ప్రకటించినట్లే 2023 వేసవి కానుకగా ఏప్రిల్ 30 ‘హరిహర వీరమల్లు’ థియేటర్లలో దిగేస్తుందని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కొత్త డెడ్ లైన్‌ను అందుకునే అవకాశం లేదట. షూటింగ్ చివరి దశకు వచ్చినప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైం పట్టేలా ఉండడం.. వాటి విషయంలో రాజీ పడితే సినిమా ఔట్ పుటే దెబ్బ తినేలా ఉండడంతో హడావుడి వద్దని అనుకుంటున్నారట.
అవ్వాల్సిన ఆలస్యం ఎలాగూ అయింది కాబట్టి రాజీ పడకుండా బెస్ట్ ప్రాడక్ట్‌ను ప్రేక్షకులకు అందిద్దామని ఫిక్సయ్యారట. అందుకే ఏప్రిల్ 30 డేట్ మీద ఆశలు వదులుకున్నట్లు సమాచారం. కాస్త కష్టపడి వేసవి చివర్లో అయినా సినిమాను రిలీజ్ చేద్దామని..లేదంటే ఆగస్టుకు షెడ్యూల్ చేద్దామని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేస్తూ.. కొత్త డేట్‌ను ఇవ్వబోతున్నట్లు సమాచారం. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates