రాజమౌళిని మెచ్చుకుంటున్న ప్రపంచ దిగ్గజాలు

ఎవరు ఔనన్నా కాదన్నా తెలుగులోనే కాదు భారతీయ సినిమాలోనే ఎవరూ అందుకోలేని ఎత్తులని రాజమౌళి చూస్తున్న మాట వాస్తవం. భవిష్యత్తులో వేరొకరు చేరుకుంటారో లేదో కానీ వందేళ్లకు దగ్గరవుతున్న టాలీవుడ్ కు మాత్రం మర్చిపోలేని కీర్తి మకుటంగా నిలబడుతున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలే దానికి నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా టాప్ 3 హయ్యెస్ట్ గ్రాసర్స్ (అవతార్ ది వే అఫ్ వాటర్ – అవతార్ – టైటానిక్) తన పేరు మీద రాసుకున్న విఖ్యాత దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఆర్ఆర్ఆర్ ని ప్రశంసలతో ముంచెత్తడమే కాదు ఏకంగా పది నిమిషాల పాటు దాని గురించి రాజమౌళితో చర్చించడం గురించి ఏమని చెప్పగలం

అంతే కాదు కాదు తన భార్య సుజికి వ్యక్తిగతంగా రికమండ్ చేయడమే కాక ఆవిడతో కలిసి మరోసారి ట్రిపులార్ ని చూశారట. ఇంతకన్నా జక్కన్నకు కావాల్సింది ఏముంటుంది. అసలు టైటానిక్ రిలీజైన టైంకి ఇండస్ట్రీలో లేని రాజమౌళికి ఇప్పుడు దాని సృష్టికర్తతో శభాష్ అనిపించుకోవడం కంటే ఉద్వేగభరిత క్షణం మరొకటి దొరుకుతుందా. అందుకే వాటి తాలూకు ఫోటోలను జక్కన్న తన ట్విట్టర్ లో షేర్ చేసుకుని అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఇటీవలే మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ గా పిలవబడే ఎవర్ గ్రీన్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్ తోనూ ఇలాంటి జ్ఞాపకమే పంచుకున్న రాజమౌళి తనొక్కరే కాదు అందరూ గర్వపడేలా చేస్తున్నారు

ఆస్కార్ సాధించే దాకా ఆర్ఆర్ఆర్ పరుగు ఆగేలా లేదు. అది వచ్చినా రాకపోయినా టాలీవుడ్ జెండా అంతర్జాతీయ వీధుల్లో సగర్వంగా ఎగిరింది. విడుదలై ఏడాదికి దగ్గరగా ఉన్నా ఇంకా దాని ప్రకంపనలు కొనసాగడం చిన్న విషయం కాదు. ఇప్పుడీ ఘనత త్వరలో మొదలుపెట్టబోయే మహేష్ బాబు మూవీ మీద ఓ రేంజ్ లో అంచనాలు పెంచనుంది. అసలు ప్రకటన స్టేజి నుంచే విపరీతమైన ఎగ్జైట్మెంట్ కు గురి చేసిన ఈ ప్రాజెక్ట్ మొదలయ్యాక ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. ఆర్ఆర్ఆర్ సందడి మాత్రం మార్చి దాకా కొనసాగుతూనే ఉంటుంది