చిరంజీవిపై విషప్రయోగం నిజమా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పతాక స్థాయిలో ఉండగా ఆయన మీద విష ప్రయోగం జరిగినట్లు ఒక వార్త అప్పట్లో సంచలనం రేపింది. దీని గురించి మీడియాలో వచ్చిన వార్తల కటింగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతుంటాయి.

చిరు ఎదుగుదలను, ఆయన ఆధిపత్యాన్ని తట్టుకోలేక ఇండస్ట్రీలోని ఒక వర్గం ఆయన మీద ఇలా కుట్ర పన్నిందని మెగా అభిమానులు అంటుంటారు. ఐతే ఆ ఉదంతానికి సంబంధించి అసలు చిరంజీవి ఉద్దేశం ఏంటి.. నిజంగా తన మీద విష ప్రయోగం జరిగిందని ఆయన భావించారా.. అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నది స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వివరించే ప్రయత్నం చేశారు చిరు.

‘‘నేను ఆ రోజు మరణమృదంగం షూటింగ్‌లో ఉన్నాను. హార్స్ రేసింగ్ క్లబ్‌లో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ అయ్యాక అభిమానులు కలిసి కేక్ కట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అప్పుడు ఒక అభిమాని కేక్ కట్ చేశాక నాకు తినిపించబోయాడు. నాకు ఎవరైనా అలా కేక్ కట్ చేశాక చేతిలోకి తీసుకుని నోట్లో పెడితే నచ్చదు. స్పూన్‌తో తీసుకుని తింటాను. కానీ ఆ వ్యక్తి బలవంతంగా నోట్లోకి కేకును తోసేశాడు. కానీ దాని రుచి నోటికి తాకగానే కొంచెం చేదుగా, ఏదో తేడాగా అనిపించింది.

దీంతో వెంటనే దాన్ని ఊచేశా. పక్కన ఉన్న కేఎస్ రామారావు ఆ అభిమానని పట్టుకున్నారు. చేయిచేసుకున్నారు కూడా. అది విష ప్రయోగం అనే అనుకున్నారు చాలామంది. కానీ ఆ అభిమానిని రామారావు గారు కొట్టి అడిగితే.. అసలు విషయం చెప్పాడు. తాను ఇటీవల చిరంజీవి గారికి దూరం అయ్యానని.. వేరే అభిమానులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని.. తనను పట్టించుకోవడం లేదని.. అందుకే కేరళకు వెళ్లి ఒక వశీకరణ మందు తీసుకొచ్చి ఈ కేకులో కలిపానని.. అది తిని ఆయన మళ్లీ తనను ముందులా ఆదరిస్తారని అనుకున్నానని చెప్పాడు. వ్యవహారం పోలీసుల వరకు కూడా వెళ్లింది. నేనైతే అది విష ప్రయోగం అనుకోవట్లేదు. ఆ అభిమాని చెప్పింది నిజమే అనుకుంటున్నా’’ అని చిరు వివరించాడు.

ఇక అప్పట్లో స్టార్‌ హీరోగా ఒక వెలుగు వెలిగిన సుమన్ జైలు పాలవడానికి తానే కారణం అంటూ వచ్చిన వార్తల మీదా చిరు స్పందించాడు. సుమన్‌తో తనకు మంచి స్నేహం ఉందని, ఆ ఆరోపణల్ని సుమనే స్వయంగా పలుమార్లు ఖండించాడని.. ఇక దాని గురించి తాను మాట్లాడేది ఏమీ లేదని చిరు చెప్పాడు. ఎవరో ఒక పోరంబోకు జర్నలిస్టు (ఈ మాట వాడకూడదు అంటూనే వాడారు) ఇష్టం వచ్చినట్లు ఆ వార్త రాసేస్తే అది చూసి కొందరు నిజం అనుకున్నారని.. సుమన్‌ తనకు ఇప్పటికీ మంచి స్నేహితుడని.. ఎయిటీస్ రీయూనియన్లో తామిద్దరం కలుస్తుంటామని చిరు తెలిపాడు.