మెగాస్టార్ అతి మంచితనం మీద ఇటీవల బాగా చర్చ జరుగుతోంది. మామూలుగానే చిరు ఎవరినీ గట్టిగా ఒక మాట అనడు. రాజకీయాల్లో ఇమడలేక బయటికి వచ్చేశాక ఆయన మరింత సున్నితమైన వ్యక్తిగా మారిపోయారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ శత్రువులతోనూ చిరు చాలా మంచిగా ఉండడం పట్ల అభిమానుల్లో అభ్యంతరం వ్యక్తం కావడం తెలిసిందే. సినీ రంగంలో కూడా తనను ఎవరైనా టార్గెట్ చేసినా.. తనపై విమర్శలు గుప్పించినా ఆయన స్పందించరు. ఇలా ఉండడం కరెక్ట్ కాదని అభిమానులు కూడా అంటుంటారు. ఐతే తాను ఎందుకు అలా ఉంటానో చిరు ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన సందర్భంగా వివరించే ప్రయత్నం చేశారు.
“అందరితో మంచిగా ఉండడం, సంయమనం పాటించడం కచ్చితంగా అవసరమే. ఏదైనా సంఘటన జరిగినపుడు ఎదురు తిరిగితే నా ఇగో చల్లారుతుందేమో కానీ.. నా సినిమాకు భారీగా నష్టం జరగొచ్చు. దాని వల్ల అభిమానులు నిరాశ చెందుతారు. నా సంయమనం అందరికీ మంచి చేస్తుందంటే నేను వెనక్కి తగ్గుతాను. అంతిమ ఫలితం సానుకూలంగా రావడం ముఖ్యం” అని చిరు చెప్పాడు.
ఇక సంక్రాంతి రేసులో తన సినిమానే చివరగా రావడం గురించి చిరు స్పందిస్తూ.. “సంక్రాంతికి మైత్రీ సంస్థ నుంచే రెండు సినిమాలు రిలీజవుతున్నాయి. మంచి సినిమా ఎప్పుడైనా విజయం సాధిస్తుంది. బయ్యర్లను, ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని అందరికీ మంచి జరిగేలా రిలీజ్ డేట్లు నిర్ణయించాం” అని చిరు అన్నాడు. భవిష్యత్తులో తనకు దర్శకత్వం చేయగలననే నమ్మకం కలిగినపుడు దర్శకుడిగా మారుతానని చిరు ఈ సందర్భంగా చెప్పడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates