అడివి శేష్ సిక్స్ ప్యాక్


టాలీవుడ్ యువ కథానాయకుడు అడివి శేష్ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. అతడి పేరే ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ‘క్షణం’తో సోలో హీరోగా తొలి విజయాన్ని అందుకున్నప్పటి నుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తున్న శేష్.. ఆ తర్వాత గూఢచారి, ఎవరు, మేజర్, హిట్-2 సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్నాడు. ముఖ్యంగా గత ఏడాది మేజర్, హిట్-2 సినిమాలు పెద్ద హిట్టయి.. అతడి ఇమేజ్‌ను పెంచాయి. పాన్ ఇండియా లెవెల్లో శేష్ పాపులారిటీ సంపాదించాడు. ఈ ఊపులోనే తన కెరీర్లో అతి పెద్ద సినిమాకు రెడీ అయ్యాడు శేష్.

తన సూపర్ హిట్ మూవీ ‘గూఢచారి’కి అతను సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గూఢచారి లాగే దీనికి కూడా అతనే స్క్రిప్టు అందిస్తున్నాడు. గూఢచారి, మేజర్ చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పని చేసిన వినయ్ కుమార్ సిరిగినీడు ఈ చిత్రంతో దర్శకుడివగా పరిచయం అవుతున్నాడు. ‘కార్తికేయ-2’ సినిమాను ప్రొడ్యూస్ చేసిన అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్‌లతో పాటు ‘గూఢచారి’ నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

‘గూఢచారి’ పాన్ ఇండియా ఫ్రాంఛైజీగా మారబోతున్నట్లు ప్రకటించిన శేష్… ఈ సినిమా కోసం కెరీర్లో తొలిసారి సిక్స్ ప్యాక్ చేయనున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాలో యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని శేష్ చెప్పాడు.

“దక్షిణాదిన మళ్లీ స్పై సినిమాల ట్రెండ్‌కు ఊపు తెచ్చింది ‘గూఢచారి’. ‘జీ-2’తో గూఢచారి ఆలిండియా స్పై ఫ్రాంఛైజీగా మారబోతోంది. ఈ సినిమాను ప్రపంచ స్థాయికి కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. మన సినిమా రాజమౌళిగారి వల్ల ప్రపంచ స్థాయికి వెళ్లింది. ఆయన చూపిన దారిలో ముందుకు వెళ్లానుకుంటున్నాం. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి మరో స్థాయి సినిమాను అందిస్తామని ధీమాగా చెప్పగలను. ప్రస్తుతం స్క్రిప్టు సిద్ధమవుతోంది. నేను కొన్ని నెలల పాటు కష్టపడి సిక్స్ ప్యాక్ చేయాలి. ఆ తర్వాత సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తాం” అని శేష్ తెలిపాడు. వినయ్ కుమార్ ప్రతిభావంతుడైన దర్శకుడని.. గూఢచారి, మేజర్ సినిమాలు చేస్తున్నపుడు తనకు, దర్శకుడు శశికిరణ్‌కు ఏవైనా డౌట్లు వస్తే వినయ్‌ను అడిగేవాళ్లమని.. అతడి మాటను అనుసరించి ముందుకు వెళ్లేవాళ్లమని, ‘గూఢచారి-2’తో అతడి ప్రతిభ ప్రపంచానికి పరిచయం అవుతుందని శేష్ తెలిపాడు.