ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు స్థానం ప్రత్యేకం. అధికారం ఏ పార్టీదైతే ఆయన ఆ పార్టీలో ఉంటారని పేరు. గత ఎన్నికల్లో మాత్రం ఈ లెక్క తప్పింది. ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినా టీడీపీ అధికారంలోకి రాలేదు. ఆయన కూడా పాలక వైసీపీలోకి వెళ్లలేకపోయారు. దీంతో చాలాకాలంగా కామ్‌గా ఉన్న ఆయన టీడీపీ కార్యకలాపాలకూ దూరంగా ఉంటున్నారు.
తాజాగా పవన్, చంద్రబాబుల భేటీ తరువాత ఆయన ఎవరూ ఊహించని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. ఇద్దరూ సుమారు ముప్పావు గంట పాటు భేటీ అయ్యారు. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది బయటకు వెల్లడించకపోయినా గంటా తనకు తానుగా వచ్చి లోకేశ్ ను కలిశారంటేనే దానర్థం ఆయన టీడీపీలో మళ్లీ యాక్టివేట్ కావడానికి రెడీ అవుతున్నట్లు అర్థమని అంటున్నారు ఆయన గురించి తెలిసినవారు.
త్వరలో లోకేశ్ పాదయాత్ర ఉండడంతో పాదయాత్ర నుంచి గంటా యాక్టివేట్ కావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లోకేశ్ పాదయాత్ర వ్యవహారాలలో ఆయన కీలకం కానున్నారని… లోకేశ్ వెంట ఆయన కూడా ఉండొచ్చని తెలుస్తోంది.
గంటా గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2019లో టీడీపీ నుంచి గెలిచిన అతికొద్ది మంది ఎమ్మెల్యేలలో గంటా కూడా ఒకరు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన సైలెంటయ్యారు. అంతేకాదు… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. కానీ, అది ఆమోదం పొందలేదు. ఆయన వైసీపీలో చేరుతారంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది.
అంతేకాదు.. కాపు నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించినట్లూ వార్తలొచ్చాయి. కాపు వర్గాల్లో పట్టున్న గంటా.. చిరంజీవికి సన్నిహితుడు. ఆయనతో చర్చించే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని అంటారు. అన్నట్లుగానే ఆయన లైన్ చిరంజీవి కదలికలకు అనుగుణంగానే సాగుతోంది. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలలో లేకున్నా ఆయన అడుగులు, మాటలు రాజకీయ సూచనలిస్తుంటాయి.
ఏపీలో సినిమా టికెట్ల ధరలు బాగా తగ్గించి ఇండస్ట్రీ ఇబ్బందులు పడినప్పుడు చిరంజీవి సీఎం జగన్‌ను కలిశారు. దాదాపు ఆ టైంలోనే గంటా వైసీపీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. ఇక ఇటీవల చిరంజీవి జగన్ తీరును పరోక్షంగా విమర్శించారు. తన తమ్ముడు పవన్‌కు అనుకూలంగా మాట్లాడారు. తాజాగా పవన్ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని తెలుస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో గంటా టీడీపీతోనే కొనసాగడానికినిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.
లోకేశ్‌తో భేటీలో గంటా.. ఇక పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తానని చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా లోకేశ్ పాదయాత్ర సూపర్ సక్సెస్ చేయడానికి ఆయన రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. లోకేశ్ వెంట పాదయాత్రలో గంటా కనిపిస్తారని అంటున్నారు. జనసేన, టీడీపీలు కలిస్తే అధికారంలోకి రావడం ఖాయమని.. అప్పుడు తనకు మంత్రి పదవి ఖాయమనే లెక్కలతోనే ఆయన మళ్లీ ఇన్నాళ్లకు టీడీపీ పెద్దల దగ్గరకు వచ్చినట్లు చెప్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates