షారుఖ్.. నెగెటివిటీని జయించినట్లేనా?

షారుఖ్ ఖాన్ తన కెరీర్లోనే అతి పెద్ద బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ‘జీరో’ సినిమా తన కెరీర్‌ను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాక చాలా గ్యాప్ తీసుకుని జాగ్రత్తగా చేసిన ‘పఠాన్’ సినిమా ఈ నెలలోనే గణతంత్ర దినోత్సవ కానుకగా రిలీజవుతోంది. ఐతే ఈ సినిమాకు ముందు నుంచి మంచి బజ్‌యే ఉంది కానీ.. గత నెలలో రిలీజ్ చేసిన దీపిక సాంగ్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమై సినిమా చుట్టూ నెగెటివిటీ ముసురుకోవడం తెలిసిందే.

కాషాయ రంగు దుస్తులు ధరించి ఎక్స్‌పోజింగ్ చేసిదంటూ విచిత్రమైన అభ్యంతరంతో ఈ సినిమాను టార్గెట్ చేశారు హిందూ, భాజపా మద్దతుదారులు. ‘పఠాన్’ ప్రమోషన్ల కోసం పెట్టిన స్టాండీలు, ఫ్లెక్సీలను చించేసే వరకు ఈ నెగెటివిటీ వెళ్లిపోయింది. దీంతో అభ్యంతరాలు వ్యక్తమైన పాటను ఎడిట్ చేయడానికి కూడా చిత్ర బృందం సిద్ధపడింది. అయినా నెగెటివిటీ తగ్గిన దాఖలాలు కనిపించలేదు.

ఐతే ఈ రోజే ‘పఠాన్’ ట్రైలర్ లాంచ్ అయింది. అది సినిమా మీద ఉన్న నెగెటివిటీని తగ్గించేలాగే కనిపిస్తోంది. ఇది దేశభక్తితో ముడిపడ్డ కథ కావడం.. షారుఖ్ దేశాన్ని రక్షించే సోల్జర్ పాత్ర చేస్తుండడం సినిమాకు ప్లస్సే. దేశభక్తి తాలూకు ఎమోషన్ అంటే హిందూ, భాజపా మద్దతుదారులుగా చెప్పుకునే సోషల్ మీడియా బ్యాచ్ ఊగిపోతుంటుంది. గత రెండేళ్ల నుంచి ఈ బ్యాచే సిల్లీ విషయాలను పట్టుకుని సినిమాలను టార్గెట్ చేయడం, బాయ్‌కాట్ ట్రెండ్ చేయడం చేస్తోంది. వాళ్లే ఏదైనా దేశభక్తి, హిందూ ప్రో సినిమాలు వస్తే నెత్తిన పెట్టుకుని మోస్తున్నాయి.

‘పఠాన్’ ట్రైలర్ గమనిస్తే దేశం కోసం ఏమైనా చేసే సోల్జర్ పాత్రలా కనిపించింది షారుఖ్‌ది. ట్రైలర్ చివర్లో జైహింద్ అని కూడా అనేశాడు. ఇక ఈ బాయ్‌కాట్ బ్యాచ్‌ ఇగో శాటిస్ఫై కావడానికి ఇంతకంటే ఏం కావాలి? కాబట్టి ఇప్పటిదాకా ఉన్న నెగెటివిటీ ఇకనైనా తగ్గుతుందని ఆశించవచ్చు. సామాన్య ప్రేక్షకులనైతే ‘పఠాన్’ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటోంది. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా విందు భోజనంలా కనిపిస్తోంది.