వెంకటేష్ సరసన కెజిఎఫ్ భామ

అదేంటో పన్నెండు వందల కోట్లు వసూలు చేసిన కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ లో నటించిన హీరోయిన్ కి అవకాశాలు నెమ్మదిగా రావడం విచిత్రంగా ఉంది. విక్రమ్ కోబ్రాలో చేసింది కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో శ్రీనిధి శెట్టి కెరీర్ డోలాయమానంలో పడింది. ఇలాంటి పరిస్థితిలో సీనియర్ అయినా సరే ఒక మంచి కాంబినేషన్ లో ప్రాజెక్టు దక్కడమంటే మంచిదే. వెంకటేష్ హీరోగా హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ లో తననే ఎంపిక చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. అఫీషియల్ గా త్వరలోనే ప్రకటించబోతున్నారు. జనవరి 26న ఓపెనింగ్ ఉంటుందని టాక్.

ఒకరకంగా చెప్పాలంటే శ్రీనిధికి ఇది బెటర్ ఆఫర్. ఎందుకంటే లేట్ ఏజ్ హీరోలతో చేయకూడదని నియమం పెట్టుకునే నడిచే రోజులు కావివి. టైమింగ్ కలిసొస్తే వాళ్ళతోనే పెద్ద హిట్లు పడొచ్చు. రీసెంట్ గా ధమాకా చూశాంగా. రవితేజ శ్రీలీల జంట మీద ట్రోలింగ్ చేసిన మీమ్స్ రాయుళ్లే తర్వాత వాళ్లిద్దరూ డాన్స్ చేసిన వీడియోలని వైరల్ చేసి పండగ చేసుకున్నారు. ఆ పెయిర్ మీద ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. సో శ్రీనిధి శెట్టి వెంకటేష్ తో చేసినా ఇలాంటి ఫలితాన్నే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. బడ్జెట్ పరంగా హిట్ రెండు భాగాలకు దీనికి శైలేష్ చాలా స్కేల్ పెంచేశాడట.

హిట్ 3ని నానితో ఆల్రెడీ లాక్ చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ స్పెషలిస్ట్ వెంకటేష్ సినిమాని పూర్తి చేశాక దాని స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తారు. వెంకీ 75 ల్యాండ్ మార్క్ మూవీగా దీన్నే ప్రచారం చేస్తున్నారు అభిమానులు. నెంబర్ కరెక్టా కాదా అనేది అనౌన్స్ మెంట్ నాడు తెలుస్తుంది. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందబోయే ఈ మూవీ రెగ్యులర్ షూట్ ఇంకో రెండు నెలల తర్వాత ఉండొచ్చు. గత ఏడాది ఎఫ్3 ఘన విజయం, ఓరి దేవుడా యావరేజ్ రిజల్ట్ తో మిశ్రమ ఫలితం అందుకున్న వెంకటేష్ ఈ ఏడాది ఎన్ని సినిమాలు చేస్తారనేది క్లారిటీ లేదు. మరీ దూకుడుగా ఉండకపోవచ్చు.