మెగాస్టార్ వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పాడా?

సెకండ్ ఇన్నింగ్స్‌లో యంగ్ హీరోల కంటే స్పీడ్‌గా వరుసగా ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ చేస్తున్న మెగాస్టార్, ఆ తర్వాత ముగ్గురు డైరెక్టర్లతో సినిమాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. యంగ్ డైరెక్టర్స్ సుజిత్, బాబీ, మెహార్ రమేశ్‌లతో సినిమాలు చేస్తానని చెప్పి, మెగా ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన చిరూ… ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం మిగిలిన భాషలతో పాటు తెలుగులోనూ వెబ్ సిరీస్‌లకు కూడా క్రేజ్ పెరుగుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలు, సినిమాల కంటే వెబ్ సిరీస్‌లను వీక్షించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో స్టార్ హీరోలను వెబ్ సిరీస్‌ల్లో నటింపచేసి, వాటికి మరింత క్రేజ్ తేవాలని ప్రయత్నిస్తున్నాయి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్.  

అలా ఓ టాప్ ఓటీటీ నుంచి మెగాస్టార్‌కు కాల్ వచ్చిందట. వారి ఆఫర్‌కు పాజిటివ్‌గా స్పందించిన చిరూ ‘డైరెక్టర్‌ను పంపించండి… కథను వింటానని’ చెప్పారట. మంచి క్రేజీ కథలతో వచ్చే యంగ్ దర్శకులను తనవద్దకు తీసుకురమ్మని మేనేజర్‌కు ప్రత్యేకంగా చెప్పారట. దీంతో చిరూ త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటిదాకా శ్రీకాంత్, జగపతిబాబు వంటి మిడియం రేంజ్ సీనియర్ హీరోలు మాత్రమే వెబ్ సిరీస్‌ల్లో నటించారు. చిరంజీవిలాంటి టాప్ స్టార్ ఎంట్రీ ఇస్తే, తెలుగులోనూ వెబ్ సిరీస్‌లకు మహర్ధశ పట్టినట్టే. మెగా బావమరిది అల్లుఅరవింద్‌ ‘ఆహా’ పేరు ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే ఆదరణ దక్కించుకుంటున్న ‘ఆహా’కు క్రేజ్ తేవడం కోసం చిరూ ఈ మెగా స్టెప్ తీసుకుంటాడనే టాక్ కూడా వినిపిస్తోంది.