పవర్ స్టార్ పవన్ అభిమానులిప్పుడు రామ్ గోపాల్ వర్మపై మామూలు కోపంతో లేరు. కొన్నేళ్లుగా అదే పనిగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న వర్మ.. ఈ మధ్య మరీ శ్రుతి మించి పోతున్నాడు. ముఖ్యంగా పవన్ విషయంలో ఆయన తీరు తీవ్ర విమర్శలకు, అభ్యంతరాలకు దారి తీస్తోంది.
గతంలో శ్రీరెడ్డిని పవన్ మీద ఉసిగొల్పి.. దారుణమైన బూతు మాట అనిపించిన ఘనత వర్మదే. ఈ విషయాన్ని స్వయంగా తనే అంగీకరించాడు కూడా. అంతటితో ఆగకుండా వీలు చిక్కినపుడల్లా పవన్‌ను కించపరిచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
ఇంతకుముందే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలో పవన్ పాత్రను పెట్టి.. చీప్‌గా చూపించాడు. ఇప్పుడు ఏకంగా ‘పవర్ స్టార్’ పేరుతో పవన్ మీదే ఓ సినిమా తీసేశాడు.
ఇంకో నాలుగు రోజుల్లోనే ‘పవర్ స్టార్’ సినిమా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా విడుదల కాబోతోంది. ఈ సినిమాను ఎంత ఇగ్నోర్ చేస్తే అంత మంచిదన్న ఉద్దేశంతో పవన్ ఫ్యాన్స్ సంయమనం పాటిస్తున్నారు. వర్మ కవ్విస్తున్నప్పటికీ రెచ్చిపోవట్లేదు. ఐతే అందరు అభిమానులూ ఇలా ఉండరు కదా. వర్మను కౌంటర్ చేయడానికి ఓ బ్యాచ్ సిద్ధమైంది.
వాళ్లందరూ కలిసి ‘పరాన్నజీవి’ పేరుతో వర్మ మీద సినిమా మొదలుపెట్టడం విశేషం. ఇంగ్లిష్‌లో ఈ పేరును paRannaGeeViగా సంబోధిస్తూ వర్మను టార్గెట్ చేసిందీ వర్గం. ‘బిగ్ బాస్’ ఫేమ్ నూతన్ నాయుడు ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.
తాము వర్మలా దాగుడు మూతలు ఆడట్లేదని.. ఇది వర్మను టార్గెట్ చేసిన సినిమా అని.. ఆయన నిజ స్వరూపం ఏంటో ఈ సినిమాలో చూపిస్తామని.. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates