రానానాయుడుని ఎందుకు దాచిపెడుతున్నారు

rananaidu

మాములుగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల విడుదల ఆలస్యం కావడం చాలాసార్లు చూశాం. ఉదాహరణకు అవతారే తీసుకుంటే కేవలం గ్రాఫిక్స్ కోసమే జేమ్స్ క్యామరూన్ రెండేళ్ల టైం తీసుకుంటారు. పర్ఫెక్షన్ కోసం పడే తాపత్రయం అది. మన దగ్గరా ఈ కారణంగానే ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టుకున్న అమ్మోరు, అరుంధతి, బాహుబలి లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అఫ్ కోర్స్ ఫలితాలు కూడా అధిక శాతం దానికి తగ్గట్టు అద్భుతంగా రావడం జరిగింది. కానీ ఒక మాఫియా డ్రామా అది కూడా వెబ్ సిరీస్ కి డిలే అంటే ఏదో అనుమానించాల్సిన విషయమే ఉంటుంది.

దగ్గుబాటి వెంకటేష్ రానాల ఫస్ట్ టైం కాంబో రానా నాయుడు షూట్ ని నెట్ ఫ్లిక్స్ ఎప్పుడో పూర్తి చేసింది. గత ఏడాది దసరా లేదా దీపావళి అన్నారు. ఆ రెండు పండగలు గడిచిపోయాయి. ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తోంది. రిలీజ్ డేట్ ఇప్పటికీ కన్ఫర్మ్ చేయలేదు. బాబాయ్ అబ్బాయిల కలయికగా ఫ్యాన్స్ దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎఫ్3, ఓరి దేవుడా తర్వాత వెంకీకి కొంచెం లాంగ్ బ్రేక్ వచ్చేలా ఉంది. హిట్ ఫేమ్ శైలేష్ కొలనుతో చేయబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఇప్పుడప్పుడే మొదలుపెట్టేలా లేరు. సో తన అభిమానులకు దగ్గరలో ఉన్న ఏకైక ఆప్షన్ రానా నాయుడు మాత్రమే.

పూర్తి తెల్లజుట్టుతో వెంకటేష్ చాలా డిఫరెంట్ గా నటించారు. తనకు పూర్తిగా విరుద్ధమైన పాత్రలో రానాది కూడా స్పెషల్ గా డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు వీలైనంత త్వరగా తీసుకురావాలి కానీ ఇలా సహనానికి పరీక్ష పెట్టడం ఏమిటనేది ఫ్యాన్స్ ఫిర్యాదు. మాములుగా నెట్ ఫ్లిక్స్ ఇంతగా పెండింగ్ పెట్టదు. మరి రానా నాయుడు విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందో చూడాలి. అమెరికా టీవీ క్రైమ్ సిరీస్ రే డొనోవన్ రీమేక్ గా రూపొందిన ఈ సిరీస్ కి సుపర్న్ వర్మ – కరణ్ అంశుమాన్ లు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్య వెంకీ రానాలు దీని గురించి ఊసెత్తడం లేదెందుకో?