సముద్రం సాక్షిగా మాస్ వీరయ్య పూనకాలు

మెగా మాస్ కాంబోగా వాల్తేరు వీరయ్య మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇరవై సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కలిసిన చిరంజీవి రవితేజ కలయిక కోసం ఇద్దరి అభిమానులు ఎంతగా చూస్తున్నారో రోజురోజుకి పెరిగిపోతున్న బజ్ ని బట్టి చెప్పొచ్చు. అందుకే పోస్టర్లతో మొదలుకుని ట్రైలర్ దాకా ప్రతిదశలోనూ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ కనిపించింది. ఆచార్య డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ సైతం యావరేజ్ గా నిలిచిన నేపథ్యంలో ఊర మాస్ కంటెంట్ తో వస్తున్న వీరయ్య మీద హైప్ పెరగడం తగ్గడం ట్రైలర్ మీదే ఆధారపడి ఉంది. ప్రీ రిలీజ్ కు ఒక రోజు ముందే దీన్ని విడుదల చేయడం విశేషం.

కథని మరీ దాచే ప్రయత్నం చేయలేదు. రెండున్నర నిమిషాలకు దగ్గరగా ఉన్న ట్రైలర్ లో కంటెంట్ మీద అవగాహన వచ్చేలా చేశారు. సముద్రాన్నే నమ్ముకున్న వీరయ్య(చిరంజీవి)దాంతో స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అభియోగం మీద పోలీసు రికార్డుల్లో ఉంటాడు. అయితే అంత సులభంగా దొరికేలా చేసుకోడు. స్నేహితులతో కలిసి జాలీగా జీవితాన్ని గడిపే వీరయ్య మలేషియా వెళ్ళినప్పుడు పరిచయమైన అమ్మాయి (శృతి హాసన్)తో ప్రేమ వ్యవహారం కూడా ఉంటుంది. తిరిగి వచ్చాక సిటీకి కొత్తగా వచ్చిన పోలీస్ కమీషనర్(రవితేజ)తో వీరయ్య యుద్ధం మొదలవుతుంది. అసలు వీళ్లిద్దరికీ కనెక్షన్ ఏంటి, గూడెంకు వచ్చిన ప్రమాదం, దాని చుట్టూ ఉన్న మాఫియా స్టోరీనే ఇది.

ట్రైలర్ మొత్తం గూస్ బంప్స్ తో నింపేశారు. ఇంత పచ్చి మాస్ అవతారంలో చిరంజీవి చూసి ఎంత కాలమయ్యిందంటే గుర్తు చేసుకోవడం కష్టం. సెటప్ బ్యాక్ డ్రాప్ మరీ కొత్తగా లేకపోయినా టేకింగ్ తో పాటు ఖర్చుకు వెనుకాడకుండా డిజైన్ చేసిన యాక్షన్ విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. సగటు ప్రేక్షకులకు సైతం మంచి మసాలా ఎంటర్ టైనరనే అభిప్రాయం కలిగేలా వీరయ్యని ఎడిట్ చేసిన తీరు హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. రికార్డులు నా పేరు మీదే ఉంటాయి, ఘరానా మొగుడు ఇడియట్ డైలాగులను చిరు రవితేజలు ఇచ్చిపుచ్చుకోవడం మాములుగా పేలలేదు. దేవి బీజీఎమ్ ఓకే. మొత్తానికి వాల్తేరు వీరయ్య నుంచి ఎలాంటి ట్రీట్ ఆశిస్తున్నారో దాన్ని సంపూర్ణంగా అందించేలా ఉన్నారు.