నిర్మాతల మండలిలో గొడవ గొడవ

తెలుగు నిర్మాతల మండలి కార్యాలయంలో జరిగిన ఓ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్ణీత గడువు దాటిపోయినా నిర్మాతల మండలికి ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కొందరు సభ్యులు తాజాగా మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌ను ఆయన క్యాబిన్లో కలిశారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన తన వివరణ ఏదో ఇస్తుండగా.. ఒక వ్యక్తి తన ఫోన్ ద్వారా వీడియో తీయడం మొదలుపెట్టారు.

కాసేపటి తర్వాత సి.కళ్యాణ్ అది గమనించారు. “ఎవరయ్యా అది.. ఎందుకు షూట్ చేస్తున్నావు.. ఎవరు నువ్వు.. ఇక్కడ నీకేం పని.. వీడియో ఆపు” అంటూ గదమాయించారు. అందుకు బదులుగా ఆ వ్యక్తి.. తాను కూడా నిర్మాతల మండలి సభ్యుడినే అని వివరణ ఇచ్చాడు. తన పేరు రవిచంద్ అని కూడా తెలిపాడు.

ఐతే ఆ వ్యక్తి మర్యాదగానే మాట్లాడుతూ.. సి.కళ్యాణ్‌ను సార్ అని సంభోదిస్తూ తన వివరాలు చెబుతుండగానే సి.కళ్యాణ్‌లో కోపం కట్టలు తెంచుకుంది. నువ్వొక పనికిమాలిన మెంబర్‌వి అంటూ రవిచంద్‌ను తిట్టారు. దీంతో ఆయనకు కూడా మండిపోయింది. నువ్వొక పనికిమాలిన ప్రెసిడెంటువి అంటూ దీటుగా సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరుగుతండగా.. అక్కడున్న వాళ్లు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గతంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సి.కళ్యాణ్.. తాజా వ్యవహారంలోనూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మర్యాదగా మాట్లాడుతున్న సభ్యుడిని పట్టుకుని పనికిమాలిన మెంబర్ అంటూ తిట్టడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. నిర్మాతల మండలి ఎన్నికలకు గడువు దాటిపోయినా ఆ ఊసే ఎత్తకపోవడం పట్ల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.