పవన్ సినిమాలను ఇంతగా పిండేయాలా

సందు దొరికినప్పుడే దోపిడి చేసేయాలన్నట్టు ఉంది రీ రిలీజు సినిమాలను విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ల ఆత్రం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు నటించిన పాత బ్లాక్ బస్టర్లను ఎగబడి వదలడం, వాటి వెనుక ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా ఫ్యాన్స్ వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రికార్డుల కోసం తాపత్రయపడటం ఇదో ప్రహసనంగా మారిపోతోంది. పోకిరితో మొదలైన ఈ ట్రెండ్ నిన్న ఖుషీ వరకు బాగానే సాగింది. మధ్యలో కొన్ని తేడా కొట్టినా ప్రేక్షకులు సర్లెమ్మని ఆదరిస్తూ వచ్చారు. కానీ ఇది మితిమీరిపోయి ఇప్పుడు ఏకంగా బాకీ ఉన్నవన్నీ థియేటర్లో వేయాల్సిందే అన్న రేంజ్ లో వెళ్లిపోతున్నాయి.

తాజాగా బద్రిని జనవరి 26న రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించేశారు. దర్శకుడు పూరి జగన్నాధ్ కి డెబ్యూ మూవీ ఇది. పవన్ లోని కొత్త తరహా స్టయిలిష్ హీరోయిజం బయటికి వచ్చింది దీంతోనే, ముఖ్యంగా పవర్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ అన్నయ్య ప్రకాష్ రాజ్ తో ఛాలెంజ్ చేస్తూ చెప్పే నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్ డైలాగు ఎంత ఫేమస్సో అందరికీ గుర్తే. రమణ గోగుల పాటలు ఇప్పుడు విన్నా ఊపేస్తాయి. రేణు దేశాయ్ తో పవన్ కు ప్రేమ మొగ్గ తొడిగింది బద్రి షూటింగ్ లోనే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే అభిమానులకు దీంతో ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది.

కాకపోతే కొంత గ్యాప్ మైంటైన్ చేస్తే బాగుంటుంది. జల్సా, తమ్ముడు, ఖుషి ఇప్పుడు బద్రి ఇలా ఎక్కడిదాకా వెళ్తారు. నెక్స్ట్ పంజాని సిద్ధం చేస్తున్నారట. ఆఖరికి డిజాస్టర్లను కూడా తీసుకురావడం చూస్తుంటే ఆ తర్వాత బంగారం, కొమరం పులిలను కూడా కల్ట్ క్లాసిక్ అని ట్యాగ్ తగిలించి ఫ్యాన్స్ ని ఎమోషనల్ గా థియేటర్లకు రప్పిస్తారేమో. ఇలా చేయడం తప్పు కాదు కానీ జేబులు గుల్లయ్యేలా ఇప్పుడున్న రేట్లకు టికెట్లు అమ్ముతూ బిజినెస్ చేయడమే అన్యాయం అనిపిస్తుంది. ఈ తతంగం ఏ స్థాయికి చేరుకుందంటే కేవలం రెండు మూడు షోల కోసం లక్షలు ఖర్చుపెట్టి కటవుట్లు పెట్టేదాకా.