100 కోట్ల విలువైన ధమాకా పాఠాలు

మాస్ మహారాజా ధమాకా మూడో వారంలో సగర్వంగా అడుగు పెట్టింది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ తో మాస్ మహారాజా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ ఫిగర్ మీద ట్రేడ్ వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ గా వచ్చింది కాబట్టి దీన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో భారీ ఆక్యుపెన్సీతో చెడుగుడు ఆడిన ధమాకా ఇటు ఏ కేంద్రాల్లోనూ వీకెండ్స్ లో హ్యాపీగా ఆధిపత్యం చెలాయిస్తోంది. కనీస పోటీ లేకపోవడం ధమాకాకు అది పెద్ద సానుకూలాంశం. నిఖిల్ 18 పేజెస్ కి పర్వాలేదనే టాక్ వచ్చినా మరీ పోటీ ఇచ్చేంత స్థాయిలో కాదు.

ధమాకా ఫలితం వంద కోట్ల విలువైన పాఠాలు నేర్పిస్తోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా, సగటు మనిషి జీవన ప్రమాణాల్లో ఎంత మార్పు వచ్చినా సినిమాకు సంబంధించి మూలం మాస్ లోనే ఉంది. ఆ పల్స్ ని సరిగ్గా ఒడిసిపట్టుకుంటే కథాకథనాలు ఎంత రొటీన్ గా ఉన్నా సరే కేవలం కొన్ని అంశాలతో బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలవొచ్చు. ముఖ్యంగా ఒక సినిమా సక్సెస్ లో ఆడియో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మరోసారి అర్థమయ్యింది. హీరోయిన్ ఛాయస్ ఫలితం మీద ఎంత సానుకూల ప్రభావం చూపిస్తుందో శ్రీలల సాక్షిగా నిలుస్తోంది. రవితేజ పక్కన ఈ పడుచుపిల్లా అని కామెంట్ చేసిన వాళ్లే ఆ జంట కెమిస్ట్రీని ఎంజాయ్ చేస్తున్నారు.

అనవసరమైన పోటీకి దిగకుండా చక్కగా సోలోగా ప్లాన్ చేసుకోవడం ధమాకాకు చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఒకవేళ ఇది సంక్రాంతి లాంటి సీజన్ లో భారీ కంటెంట్ ఉన్న చిత్రాల మధ్య కాంపిటీషన్ కి సై అంటే వంద కోట్లు కలలో మాటే అయ్యేది. ఈ విషయంలో నిర్మాతలు తీసుకున్న శ్రద్ధ, మార్కెట్ పరిస్థితులను తమకు అనుకూలంగా వాడుకున్న తీరు అదిరిపోయే రిజల్ట్ ఇచ్చింది. నువ్వా నేనా అని కవ్వించుకోకుండా ఒంటరిగా రావడమనే అజెండా ధమాకాకు వర్కౌట్ అయ్యింది. ఫైనల్ రన్ కి ఎప్పుడు వచ్చినా ఇక టెన్షన్ లేదు. జనవరి 10 దాకా డామినేషన్ ధమాకాదే కాబట్టి పెద్ద ఫిగర్ తోనే సెలవు తీసుకుంటుంది.