టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చాలా ముక్కుసూటిగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తనకు ఏది నచ్చితే అదే చేసే రకం ఆయన. ఎవరితో అయినా తేడా వస్తే వాళ్లను దూరం పెట్టేస్తాడని ఆయనకు పేరుంది. అదే సమయంలో తనకు కంఫర్ట్ ఇచ్చే వాళ్లతో మళ్లీ మళ్లీ పని చేస్తుంటాడు. ఆయన ప్రస్తుతం బాగా ఇష్టపడుతున్న కెమెరామన్ అంటే.. రాం ప్రసాదే. వరుసగా తన సినిమాలకు అతణ్నే కెమెరామన్‌గా పెట్టుకుంటున్నాడు.
దర్శకుల అభిరుచి ఎలా ఉన్నా సరే.. బాలయ్య మాత్రం తనకు రాం ప్రసాదే కావాలంటున్నాడు. కొంత కాలం వరుసగా రిషి పంజాబితో సినిమాలు చేసిన బోయపాటి శ్రీను కూడా.. ‘అఖండ’కు బాలయ్య అభీష్టం మేరకు రాం ప్రసాద్‌తోనే అడ్జస్ట్ కావాల్సి వచ్చింది. ఐతే ‘వీరసింహారెడ్డి’కి మాత్రం దర్శకుడు గోపీచంద్ మలినేని కొంచెం పట్టుబట్టి రిషి పంజాబిని తీసుకున్నాడు.
మొదట్లో దర్శకుడి ఇష్టప్రకారమే రిషితో కొనసాగడానికి బాలయ్య ఒప్పుకున్నాడు. కానీ షూటింగ్ మధ్యలోకి వచ్చాక బాలయ్యకు రిషితో ఏదో తేడా కొట్టిందట. గొడవంటూ ఏమీ కాలేదు కానీ.. తన శైలికి రిషి కరెక్ట్ కాదని బాలయ్య ఫీలయ్యాడట. దీంతో రాం ప్రసాద్‌ను రప్పించి కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ బాధ్యత అప్పజెప్పాడట. బాలయ్య మొండితనం ఎలాంటిదో తెలిసిందే కాబట్టి దర్శక నిర్మాతలు ఎదురు చెప్పలేకపోయారట. రాం ప్రసాద్ రంగప్రవేశం చేసిన దగ్గర్నుంచి రిషి పంజాబి.. చాలా వరకు బాలయ్య కాంబినేషన్ లేని సీన్లనే తీస్తూ వచ్చారట.
బాలీవుడ్లో పేరున్న కెమెరామన్ అయిన రిషికి ఇది ఎంతమాత్రం రుచించకపోయినా సర్దుకుపోయినట్లు సమాచారం. ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసినపుడు కూడా రిషి ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. కూల్‌గానే కనిపించాడు. ‘వీరసింహారెడ్డి’ ఫైనల్ ఔట్ పుట్ చూస్తే.. రిషి, రాం ప్రసాద్ తీసిన సన్నివేశాల మధ్య విజువల్‌గా తేడాను గమనించవచ్చని అంటున్నారు.