3 వేల కోట్లతో ఎన్ని సినిమాలు తీస్తారో

మాములుగా ఒక సినిమా నిర్మాణ సంస్థ తమ బడ్జెట్ ఇంతని ఓపెన్ గా పబ్లిక్ గా చెప్పదు. ఎక్కువసార్లు అఫ్ ది రికార్డు మీడియాతో చెప్పినవే ప్రచారంలోకి వచ్చి అవే నిజమనేలా చెలామణి అవుతాయి. ఇందులో మార్కెటింగ్ చేసుకోవడం కోసం చెప్పిన అబద్దాలూ ఉండొచ్చు. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ కి ఎంత ఖర్చయ్యిందో అడిగితే నిర్మాత దానయ్య నవ్వుతారే తప్ప ఖచ్చితమైన సమాధానం చెప్పరు. ఆదాయపు పన్నుతో వచ్చిన చిక్కులు ఎందుకు లెమ్మని దాదాపు అందరూ స్పందించే విధానం ఇలాగే ఉంటుంది. కానీ దానికి భిన్నంగా శాండల్ వుడ్ ని శాశించే స్థితికి చేరుకున్న హోంబాలే ఫిలిమ్స్ కొత్త ప్రకటనతో షాక్ ఇచ్చింది.

ప్రేక్షకులకు ఇండస్ట్రీ వర్గాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే అయిదేళ్లలో మూడు వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం చేస్తున్నామని సినిమా ఎదుగుదలకు తమ వంతు కృషి చేస్తామని ఓపెన్ లెటర్ ద్వారా ప్రకటించారు. అసలు ఇంత డబ్బుతో ఎన్ని మూవీస్ ప్లాన్ చేసుకున్నారో డౌట్ రావడం సహజం.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి గమనిస్తే తెలుగు తమిళ కన్నడ మలయాళం నాలుగు భాషల్లోనూ క్రేజీ ప్రోజెక్టులను లైన్ లో పెట్టారు. ప్రభాస్ సలార్, పృద్విరాజ్ సుకుమారన్ టైసన్, శ్రీమురళి భగీరా, రక్షిత్ శెట్టి రిచర్డ్ ఆంటోనీ, ఫహద్ ఫాసిల్ ధూమం, కీర్తి సురేష్ రఘుతాతతో పాటు రాఘవేంద్ర స్టోర్స్ నిర్మాణంలో ఉన్నాయి.

ఇవి కాకుండా ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్ లో ఇంకో ప్యాన్ ఇండియా మూవీ ఓకే అయ్యింది. హీరో సూర్యనా విజయా అనేది ఇంకా ఫైనల్ కాలేదు. షారుఖ్ ఖాన్ తో సైతం సదరు హోంబాలే అధినేతలు స్కెచ్ వేసే పనిలో ఉన్నారు. కింగ్ ఖాన్ ఓకే చెబితే ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రాన్ని తీస్తారట.

మరో పది దాకా స్క్రిప్ట్ దశ పనుల్లో ఉన్నాయి. డేట్లు అడగటం ఆలస్యం ఇవ్వడానికి చోటా బడా హీరోలు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ లెక్కన చూస్తే మూడు వేల కోట్లతో ఎంతలేదన్నా ఓ యాభై పెద్ద సినిమాలు సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఐటి అధికారుల దృష్టికి ఈ ప్రకటన పోకుండా ఉంటుందా.